Ap Politics : మూడు పార్టీలదీ మూడు దారులట.. అక్కడ పరిస్థితిని చూసి చంద్రబాబు షాకయ్యారట
గత ఎన్నికల్లో పోటీ చేయని, ఓటమి చెందిన స్థానాల్లో టీడీపీ పరిస్థితి ఎలా ఉందన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది;

గత ఎన్నికల్లో పోటీ చేయని, ఓటమి చెందిన స్థానాల్లో టీడీపీ పరిస్థితి ఎలా ఉందన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. మూడు పార్టీలు కలసి 164 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించాయి. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందగా, బీజేపీ పోటీ చేసిన పది నియోజకవర్గాల్లో ఆరింటిలో మాత్రమే విజయం సాధించింది. మిగిలిన అన్ని స్థానాల్లో టీడీపీ గెలిచినా కొన్ని నియోజకవర్గాల్లో ఓటమి పాలయింది. పొత్తులో భాగంగా 31 నియోజకవర్గాల్లో బరిలోకి దిగకపోయినా 95 శాతం స్ట్రయిక్ రేట్ ను తెలుగుదేశం పార్టీ సాధించిందని చెప్పాలి.
పది నెలలు గడిచినా..
అయితే ఎన్నికలు పూర్తయి పది నెలలు గడుస్తున్నాయి. టీడీపీ పోటీ చేయని, కూటమి పార్టీలు ఓటమి చెందిన నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఇన్ ఛార్జులుగా వ్యవహరిస్తున్నారు. అయితే వీటిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల రివ్యూ చేసినట్లు సమాచారం. అయితే అక్కడ కూటమి పార్టీ నేతల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపించాయి. అనేక అంశాలపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య సయోధ్యత లేదని గుర్తించారు. ఎవరి దారి వారిదేనంటూ వచ్చిన నివేదికలతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా మంత్రులను నియమించినా వారు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని తెలిసి చంద్రబాబు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారట.
తొలి దశలో...
దీంతో తానే నేరుగా ఆ నియోజకవర్గాల్లో ఫోకస్ పెట్టాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. అక్కడి నేతలతో నేరుగా సమావేశమై పరిస్థితిపై చర్చించాలని భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వరసగా ఈ నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ ఛార్జి నేతలతో చంద్రబాబు నేరుగా మాట్లాడే అవకాశాలున్నాయని తెలిసింది. ఆ నియోజకవర్గాల్లో మూడు పార్టీలదీ మూడు దారులని తెలియడంతో ముందు జాగ్రత్త చర్యగా నష్ట నివారణ చర్యలు చేపట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. తొలుత సంబంధిత జిల్లా ఇన్ ఛార్జి మంత్రితో వారిని కలిపి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించడం తొలి ప్రయత్నంలో చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది.
రెండో ప్రయత్నంలో...
రెండో ప్రయత్నంలో వారందరితో తానే మాట్లాడి వచ్చే ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరాలంటే సమన్వయంతో కలసి పనిచేయాల్సిన అవసరాన్ని వారికి చెప్పనున్నారు. వారి సమస్యలను నేరుగా పరిష్కరించడానికి అవసరమైతే ఒక ప్రత్యేక ఏర్పాటును కూడా చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. గెలిచిన నియోజకవర్గాల్లో ఎలా ఉన్నప్పటికీ, మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయని, ఓటమి పాలయిన నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ ఛార్జులు, అసంతృప్త నేతలతో కలసి త్వరలోనే ఒక మీటింగ్ ను ఏర్పాటు చేసి సెట్ చేయాలని చూస్తున్నారు. బహుశా ఈ నెలాఖరు కానీ, వచ్చే నెల మొదటి వారంలో కానీ ఈ పనిని చంద్రబాబు ప్రారంభించే అవకాశాలున్నాయని తెలిసింది.