Tirumala : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఇంతగా ఉండటంతో?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు;

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తులు క్యూ లైన్ లలో గంటల కొద్ది స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వేసవి తీవ్రత భక్తులకు తగలకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకున్నారు. క్యూ లైన్ లో ఉన్నవారికి, కంపార్ట్ మెంట్లలో భక్తులకు శ్రీవారి సేవకులు చల్లటి మజ్జిగ, మంచినీరు, అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.
ఎండ తీవ్రత నుంచి...
ఎండల తీవ్రత ఎక్కువ ఉండటంతో కంపార్ట్ మెంట్లలోనూ ఎయిర్ కూలర్లను పెట్టి చల్లదనాన్ని నింపుతున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా ఆలయం వెలుపలకూడా కార్పెట్లు వేయడంతో పాటు గా వాటిపైన నీళ్లు జల్లుతున్నారు. భక్తులు నడిచే మార్గంలో వైట్ పెయింట్ ను వేసి కాళ్లు మాడిపోకుండా భక్తులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు ఎస్.ఎస్.డి. టోకెన్లు జారీ చేస్తుండటంతో ఎక్కువ మంది తిరుపతి, తిరుమలలో టోకెన్లు తీసుకుని స్వామి వారి దర్శనానికి క్యూ లైన్ లో ఉన్నారు.
పద్దెనిమిది గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయట ఏటీజీహెచ్ వరకూ క్యూ లైన్ ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం దర్శనం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 75,428 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,920 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.40 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని అధికారుల తెలిపారు.