Kolikipudi : నోరు తెస్తున్న తంటా.. చేతలు కూడా వివాదాలమయమేనా?

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వరస వివాదాల్లో చిక్కుకుంటున్నారు.;

Update: 2025-03-22 08:39 GMT
kolikapudi srinivasa rao, tdp mla, controversies, thiruvur
  • whatsapp icon

నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంటారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వరస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కాకముందే వంద ఆరోపణలు ఆయన ఎదుర్కొన్నారు. అది కూడా ప్రత్యర్థుల నుంచి కాదు. సొంత పార్టీ నేతలు, కూటమి పార్టీల నాయకుల నుంచి ఆయన ఆరోపణలు ఎదుర్కొనడం టీడీపీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇప్పటికే పలు మార్లు పంచాయతీ కొలికిపూడి వివాదాలపై చేయడం, క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావడం వంటివి జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు మార్లు హెచ్చరించినా కొలికపూడి శ్రీనివాసరావు వైఖరిలో మార్పు రావడం లేదు.

చాలా కాలం తర్వాత గెలిచామన్న...
వరస వివాదాల్లో చిక్కుకోవడంతో పాటు తానే నియోజకవర్గంలో మోనార్క్ లాగా వ్యవహరిస్తుండటంతో పార్టీ పెద్దలు కూడా ఏమీ చేయలేక, చర్యలు తీసుకోలేక చేతులెత్తేస్తున్నట్లే కనపడుతుంది. చాలా రోజుల తర్వాత తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించింది. అయితే ఆ విజయం సాధించామన్న ఆనందం మాత్రం పార్టీ నేతలు, శ్రేణుల్లో కొలికపూడి శ్రీనివాసరావు మిగల్చడం లేదు. ఎన్నికయిన నాటి నుంచి ప్రతిదీ వివాదమే. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆయన పోస్ట్ చేస్తున్న వీడియోలు కూడా వైరల్ గా మారడంతో పార్టీ పెద్దలు అక్షింతలు వేశారు. బెల్ట్ షాపులంటూ దాడులు ఎమ్మెల్యే కొలికపూడి స్వయంగా నిర్వహించడంతో పాటు రహదారులపై కూర్చుని నిరసన వ్యక్తం చేయడం వంటి వాటిపై పార్టీ నాయకత్వం విచారణకు ఆదేశించింది.
గతంలో అనేక వివాదాలు...
అదే సమయంలో ఒక దళిత మహిళను అవమానించారంటూ ఆమె ఆత్మహత్యాయత్నం చేయబోవడంతో అది కాస్తా పార్టీకి ఇబ్బందికరంగా మారింది. తిరువూరు నుంచి టీడీపీలోని ఒక వర్గం వచ్చి నేరుగా చంద్రబాబు నాయుడును కలిసి కొలికపూడి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అప్పుడే చంద్రబాబు నాయుడు కొలికపూడిని హెచ్చరించారు. అమరావతి రాజధాని కోసం జరిగిన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారన్న ఏకైక కారణంతోనే పార్టీ నేతలను పక్కన పెట్టి కొలికపూడి శ్రీనివాసరావుకు టిక్కెట్ ఇస్తే గెలిచిన తర్వాత తమకు ఇబ్బందిగా మారారంటున్నారు టీడీపీ నేతలు. కొలికపూడి తన వైఖరిని మార్చుకోకపోతే పార్టీ నియోజకవర్గంలో తీవ్రంగా నష్ట పోతుందని కూడా వారు చెబుతున్నారు.
తాజాగా జనసేన నేత...
తాజాగా జనసేన పార్టీకి చెందిన తిరువూరు నేత ఒకరు కొలికపూడి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేశారు. తనను చంపేందుకు కొలికపూడి సుపారీ ఇచ్చారని కూడా జనసేన నేత ఆరోపణలు చేయడంతో పాటు కొలికపూడి శ్రీనివాసరావు అనేక అవినీతి పనులకు పాల్పడుతున్నారని, అనేక మంది నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించడం ఇప్పుడు కూటమికి ఇబ్బందికరంగా మారింది. స్థానిక టీడీపీ నాయకత్వంతో పడకపోవడం, కూటమి నేతలను కొలికపూడి కలుపుకుని పోకుండా తనకు ఇష్టమున్న వాళ్లకే పదవులు కట్టబెడుతుండటం వంటి కారణాలతోనే ఆయన వరస వివాదాల్లో చిక్కుకుంటున్నారని తెలిసింది. ఇప్పటికైనా కొలికపూడి శ్రీనివాసరావు తన వైఖరి మార్చుకోకుంటే తిరువూరులో పార్టీ మరింత ఇబ్బదుల్లో పడే అవకాశముందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News