Ys Jaggan : జగన్ ఎంట్రీ ఇస్తే సీన్ మారిపోతుందా? లీడర్లు వెళ్ళడం వైసీపీకి ప్లస్ అవుతుందా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను వదిలేసి అనేక మంది నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు.;

Update: 2025-03-22 07:37 GMT
ys jagan,  ycp chief, leaders, ap politics
  • whatsapp icon

అవును.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను వదిలేసి అనేక మంది నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. అత్యంత ఆప్తులయిన వారు కూడా పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వారికి పదవులు ఇవ్వలేదా? అంటే అదేం కాదు. సామాజికవర్గాల కోణంలోనూ, తనతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులను కేటాయించారు. అయితే అధికారం కోల్పోయిన తర్వాత పదవులు పొందిన వారే పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. బీద రవిచంద్ర, ఆర్. కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, విజయసాయిరెడ్డిలకు రాజ్యసభ పదవులు ఇచ్చినా వారు జగన్ కు బై బై చెప్పి వెళ్లిపోయారు. వారు అంతకు మించి పదవుల విషయంలో ఏం కోరుకుంటున్నారన్నది తెలయడం లేదు.

పదవులు ఇచ్చినా...
బీదరవిచంద్ర మళ్లీ రాజ్యసభ పదవి దక్కించుకున్నారు. ఆర్ కృష్ణయ్య కూడా బీజేపీలో చేరి అదే పదవికి ఎంపికయ్యారు. ఇక మోపిదేవి ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్సీలుగా ఉన్న పోతుల సునీత, జయమంగళ వెంకట రమణ, కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ లకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. ఇందులో ఎక్కువ మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే. అయినా సరే తనను నమ్మి వచ్చిన వారికి జగన్ పెద్దల సభలో స్థానం కల్పించారు. అయితే పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే వీరంతా పార్టీని వదిలి వెళ్లిపోయారు. పోతూ పోతూ.. జగన్ వైఖరి నచ్చకే తాము పార్టీని వీడి వెళుతున్నామంటూ ఒక స్టేట్ మెంట్ పారేసి వెళ్లిపోతుండటం వైసీపీ అధినేత జగన్ సయితం ఆశ్చర్యపర్చేలా చేస్తుంది.
నమ్మకంగా ఉన్న వారే...
అయితే తాను అధికారంలో ఉన్నప్పుడు నమ్మకంగా భావించి దగ్గర తీసుకున్న నేతలు వెళ్లిపోతున్నా జగన్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. కనీసం వారిని ఆగిపోవాలని కూడా కోరడం లేదు. వారంతా పార్టీని వీడేందుకు డిసైడ్ టీడీపీ నేతలతో చర్చించిన తర్వాత మాత్రమే రాజీనామాలు చేసినందున తాము ఇప్పుడు ఆగిపోవాలని బుజ్జగించినా లాభం లేదన్న అభిప్రాయానికి జగన్ వచ్చారు. అందుకు వెళ్లేవారు వెళ్లనివ్వండి.. ఉండేవారు ఉండనివ్వండి అన్న తరహాలోనే జగన్ ఉన్నారు. కనీసం వారి వద్దకు దూతలను పంపే ప్రయత్నం కూడా చేయలేదు. ఒక్క విజయసాయిరెడ్డి వద్దకు మాత్రమే తిరుపతి ఎంపీ గురుమూర్తిని పంపారు. రాజీనామా చేయవద్దని అడిగారు. అంతే తప్ప మిగిలిన వారి రాజీనామాలను పట్టించుకోలేదు.
లీడర్లు వెళ్లినా...
వైసీపీలో ఎంతో మంది ఆశావహులున్నప్పటికీ వారందరినీ పక్కన పెట్టి పదవులు ఇచ్చిన వారే వెళ్లిపోతుండటం ఒక రకంగా పార్టీకి సానుభూతి వస్తుందని భావిస్తున్నారు. వెళ్లిన నేతలు నియోజకవర్గాలను శాసించే స్థాయిలో లేకపోవడంతో పాటు వారి వల్ల పార్టీకి ఉపయోగం కూడా లేదన్నది వైసీపీ వర్గాల అభిప్రాయంగా ఉంది. అందుకే వారి పోక తనకు ఎంతో మేలు చేకూరుస్తుందని జగన్ అంచనా వేస్తున్నారు. అధికారంలోకి ఉండగా పదవులు పొందిన నేతలను కూటమి పార్టీలు తీసుకుని వారికి ప్రాధాన్యత ఇవ్వవని తెలుసు. అందుకే జగన్ కూడా వెయిట్ చేస్తున్నారు. తనకు లీడర్లు ముఖ్యం కాదని, క్యాడర్ ను కాపాడుకుంటే చాలునన్న ఉద్దేశ్యంతో ఉన్నట్లే కనిపిస్తుంది.


Tags:    

Similar News