దేవుడు స్క్రిప్ట్... జగన్ ను నమ్మలేదా?
వైసీపీ ప్లీనరీ ముగిసింది. జగన్ ముగింపు ఉపన్యాసం చేశారు. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి
వైసీపీ ప్లీనరీ ముగిసింది. జగన్ ముగింపు ఉపన్యాసం చేశారు. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ మూడేళ్లలో మంచి పాలన అందించడంపైనే దృష్టి పెట్టానని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఎంపీలను లాక్కోవడంపై తన ఫోకస్ పెట్టలేదని జగన్ అన్నారు. ఇందులో నిజమెంత? నిజంగా జగన్ పార్టీ ప్రయత్నించలేదా? లేక ఎమ్మెల్యేలు జగన్ ను నమ్మి రాలేదా? చంద్రబాబు వైపునే 20 మంది ఎమ్మెల్యేలు ఉండటానికి కారణాలేంటి? అన్నది ఏపీలో హాట్ టాపిక్.
అధికారంలో ఎవరున్నా...
నిజమే... అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా అవతలి పక్షాన్ని బలహీనపర్చాలనుకుంటుంది. పార్టీ నేతలను మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తుంది. వైరి పక్షాన్ని ఇరుకున పెట్టడమే కాకుండా ప్రజల్లో బలం కోల్పోయేలా చేయాలని తప్పకుండా కృషి చేస్తుంది. అది చంద్రబాబు అయినా జగన్ అయినా ఎవరైనా ఒకటే. ప్రతిపక్షం బలహీనంగా ఉండాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచారంటే వారు బలవంతులనే విశ్వసిస్తారు. అందుకే చేరికలను ప్రోత్సహిస్తారు.
అవసరం లేకున్నా...
2014లో చంద్రబాబు వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను తన పార్టీలో చేర్చుకున్నారు. నిజానికి ఆయనకు అవసరం లేదు. చంద్రబాబు నాయకత్వం, సమర్థత, పాలనతీరుపై నచ్చి వారు చేరారంటూ ప్రచారం చేసుకున్నారు. కానీ ప్రజలకు మాత్రం చంద్రబాబు పాలన నచ్చలేదు. అందుకే ఆయనను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇక జగన్ కూడా అధికారంలోకి వచ్చీ రాగానే నలుగురిని తన మద్దతుదారులుగా చేర్చుకున్నారు. కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ మద్దతుదారులుగా చేరారు. వీరిని అధికారికంగా పార్టీలో చేర్చుకోక పోయినా టీడీపీని వదలి వైసీపీ అనధికార ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. దానిని ఎవరూ తోసిపుచ్చలేరు.
ప్రయత్నాలే చేయలేదనడం...
చంద్రబాబుకు 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఉన్నారు. సంఖ్య స్వల్పమే. కానీ జగన్ వైపు వచ్చింది అతి స్వల్పం అనే చెప్పక తప్పదు. అయితే జగన్ తాను చేర్చుకోవడంపై దృష్టి పెట్టలేదనడం శుద్ధ తప్పు. నలుగురిని తనవైపుకు తిప్పుకున్న జగన్ మిగిలిన వారిని ఎందుకు వదిలేస్తారు. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా దక్కనివ్వకుండా చేయాలని ఆలోచన జగన్ చేయరా? ఆయనకు అంత గొప్ప మనసు ఉందా? అంటే అవుననలేం. ఎందుకంటే జగన్ ఫక్తు రాజకీయ నేత. చంద్రబాబును వదిలి మిగిలిన వారు రాలేదు. ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నా పార్టీ గడప దాటలేదు. చంద్రబాబు చేరికల కోసం కోట్ల ప్యాకేజీ ప్రకటించారన్న ప్రచారం ఉంది. జగన్ అందుకు ఇష్టపడలేదా? కేవలం ఒక కండువా మాత్రమే కప్పుతానన్నాడా? అంటే.. దీనికి సమాధానం తెలీదు. వచ్చే ఎన్నికల్లో దేవుడు స్క్రీప్ట్ చూసి నిర్ధారించుకోవాలి. అంతే తప్ప ఇప్పుడు ప్లీనరీలో చెప్పిన జగన్ మాటలను విశ్వసించలేం.