నగరిలో హైటెన్షన్.. రోజా పర్యటనకు ముందు జడ్పీటీసీ అరెస్ట్
ప్రారంభోత్సవానికి సిద్ధమైన గ్రామ సచివాలయ భవనానికి తాళం వేశారు. ఈ భవనాన్ని తానే నిర్మించానని, అయితే అందుకు సంబంధించిన బిల్లులు
ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాకు తన సొంత నియోజకవర్గం నగరిలో మరోమారు నిరసన సెగ తగిలింది. సొంతగూటిలోనే నిరసన సెగ తగలడం గమనార్హం. నగరి పరిధిలోని వడమాలపేట మండలం పత్తిపుత్తూరులో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించేందుకు రోజా వెళుతున్న సమయంలో ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోజాకు వ్యతిరేకంగా నగరిలో ఓ వర్గం తమ పరిధిలోని గ్రామాల్లోకి రోజాను రానివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఆ వర్గంలో వడమాలపేట మండల జడ్పీటీసీగా కొనసాగుతున్న మురళీధర్ రెడ్డి కూడా ఉన్నారు. రోజా తన మండలానికి వస్తున్నారన్న సమచారం అందుకున్న ఆయన తన సోదరుడు రవి రెడ్డితో కలిసి పత్తిపుత్తూరు వెళ్లారు. ప్రారంభోత్సవానికి సిద్ధమైన గ్రామ సచివాలయ భవనానికి తాళం వేశారు. ఈ భవనాన్ని తానే నిర్మించానని, అయితే అందుకు సంబంధించిన బిల్లులు ఇంకా విడుదల కాలేదని...బిల్లులు ఇప్పించిన తర్వాతే తాళం తీస్తానని భీష్మించుకుని కూర్చున్నారు. అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న రోజా వర్గీయులు మురళీధర్ రెడ్డి వర్గీయులతో ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. రోజా వర్గీయులు సచివాలయ భవన తాళాన్ని పగలగొట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగ ప్రవేశం చేసిన పోలీసులు మురళీధర్ రెడ్డితో పాటు రవి రెడ్డిని అరెస్ట్ చేసి వడమాలపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.