అన్నాడీఎంకే నుంచి శశికళ, దినకరన్ అవుట్

Update: 2017-08-28 12:39 GMT

చిన్నమ్మ శశికళకు, ఆమె అల్లుడు దినకరన్ కు అన్నాడీఎంకేతో సంబంధాలు తెగిపోయాయి. శశికళను, దినకరన్ ను పార్టీ నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే సమావేశం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఇప్పటి వరకూ శశికళ, దినకరన్ చేపట్టిన నియామకాలన్నీ చెల్లవని సమావేశం తీర్మానించింది. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పళనిస్వామి హాజరైన ఈ సమావేశంలో శశికళ కుటుంబాన్ని పార్టీకి దూరంగా పెట్టాలని నిర్ణయించారు. వారిని పార్టీని బహిష్కరిస్తూ ఈరోజు జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా జయ టీవీ, పత్రికను కూడా శశికళ చేతుల్లో నుంచి తీసుకునేందుకు చర్యలు ప్రారంభించాలని నిశ్చయించారు.

కసితీర్చుకున్న పళనిస్వామి.......

దినకరన్ పళనిస్వామితో పాటు మరికొందరు కీలక నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో పళనిస్వామి వర్గం ఈ నిర్ణయం వెంటనే తీసుకుంది. ఉప ప్రధాన కార్యదర్శి పదవి హోదాలో తమ వారందరినీ సస్పెండ్ చేస్తున్న దినకరన్ కు చెక్ పెట్టాలని పళని, పన్నీర్ వర్గాలు భావించాయి. శశికళ సూచనలమేరకే ఇదంతా జరుగుతుందని తెలియడంతో శశికళపై కూడా వేటు వేయాలని నిర్ణయించారు. దీంతో శశికళ కుటుంబానికి పార్టీతో పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్లేనని ఆ పార్టీ నేత, అన్నాడీఎంకే పార్లమెంటు సభ్యుడు ముత్తుకరప్పన్ చెప్పారు. ప్రస్తుతం పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇకపై దినకరన్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా చెల్లదన్నారు. దినకరన్ నియామకమే నిబంధనలకు, నియమావళికి వ్యతిరేకంగా జరిగిందన్నారు. మొత్తం మీద తమిళ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. మరోవైపు దినకరన్ పళని ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు మాత్రం మానలేదు.

Similar News