ఇంత అవసరమా? చంద్రబాబూ?

Update: 2017-08-26 05:30 GMT

పౌర సన్మానం అందుకునేందుకు గన్నవరం వచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు., గవర్నర్‌ నరసింహన్‌., కేంద్ర మంత్రులు అశోకగజపతి., సుజనా చౌదరిలు స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 23 కిలోమీటర్ల పొడవున వెంకయ్య కోసం భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. దీని కోసం లక్ష మందికి పైగా విద్యార్ధులు, 35 వేల మంది డ్వాక్రా మహిళల్ని తరలించారు. ఉదయం 8 గంటల నుంచి విద్యార్ధులు., డ్వాక్రా మహిళలు రోడ్డుపై పడిగాపులు పడ్డారు. ఎయిర్‌ పోర్టు నుంచి రామవరప్పాడు రింగ్‌ బెంజి సర్కిల్‌., ఎం.జి రోడ్డు ప్రకాశం బ్యారేజీ వరకు ఈ ర్యాలీ సాగింది. రోడ్ల కిరువైపులా జనం వెంకయ్యను చూసేందుకు తరలి వచ్చారు. ఇక ర్యాలీ భద్రత కోసం పోలీసులు తీవ్రంగా శ్రమించారు. 23 కిలోమీటర్ల పొడవున వాహనం వెంట పరుగులు తీస్తూ కనిపించారు.

సన్మానంతో అసహనం.....

సన్మానం పేరు చెబితేనే ఏపీ అధికార వర్గాల్లో కలవరం పుట్టిస్తోంది. ఇప్పటికే వెంకయ్య కు అనేక సన్మానాలు, సత్కారాలు జరిగాయి. ఇప్పడు మళ్ళీ పౌరసన్మానం అని భారీ ఏర్పాట్లు చేశారు. ప్రింట్‌., ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు. ఖర్చు సంగతి పక్కన పెడితే...లక్షల మంది స్కూల్ పిల్లలను రోడ్ల పైకి తీసుకొచ్చారు. ఇది దారుణమని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మరో వైపు గంటల తరబడి ప్రధాన రోడ్డు పై ట్రాఫిక్ మల్లింపు కూడా జనం సహనాన్ని పరీక్షిస్తోంది. ఒక రాజకీయ నాయకుడులా వెంకయ్య సన్మానం చేస్తోన్న తీరు తీవ్ర విమర్శలు తావిస్తోంది. ఐఏఎస్‌., ఐపీఎస్‌లతో పాటు మంత్రులు సైతం ఇదేమి వ్యవహారం అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం వ్యవహారం ఎబ్బెట్టుగా మారిందనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కి రాజకీయ కారణాలు ఉన్నా పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడమని కొందరు మంత్రులే వ్యాఖ్యనించారు. ర్యాలీతో వాళ్లేమి ఇన్సైర్‌ అవుతారని విమర్శిస్తున్నారు.

Similar News