కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పెట్రోలు, ఎల్పీజీ, డీజిల్ కార్ల పై పన్ను విధించారు. ఇప్పుడున్న పన్నులకు అదనంగా కొత్త పన్నును కలిపేశారు. ఈ కొత్త పన్నుకు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సెస్ గా నామకరణం చేసేశారు. దీంతో కార్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు వాహన డీలర్లు. చిన్న పెట్రోలు, ఎల్పీజీ, సీఎన్జీ కార్ల పై ఒక శాతం, డీజిల్ కార్ల మీద 2.5 శాతం సెస్ ను విధించారు. ఇక ఎక్కువ సామర్ధ్యమున్న కార్లు, వాహనాలపై 4 శాతం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సెస్సును విధించారు.
నోట్ల రద్దు ఎఫెక్ట్ నుంచి తేరుకోక ముందే...
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దేశీయ కార్ల అమ్మకాలకు పెద్ద దెబ్బే నంటున్నారు మార్కెటింగ్ నిపుణులు. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో కార్ల అమ్మకాలు దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టాయి. కార్ల కంపెనీలు కూడా ఇదే విషయాన్ని ప్రకటించాయి. డీలర్లయితే అమ్మకాలు గణనీయంగా తగ్గాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా అదనంగా మరో సెస్సును విధించడాన్ని కార్ల డీలర్లు తప్పుపడుతున్నారు. మొత్తం మీద ఇప్పడు కారు కొనాలంటే తడిసి మోపెడవుతుంది.