ఇద్దరు చంద్రులు మాట్లాడుకోవాలన్న ఉపరాష్ట్రపతి

Update: 2017-08-26 08:30 GMT

రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య పిలుపునిచ్చారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన పౌరసన్మానంతో వెంకయ్య మురిసిపోయారు. ప్రజలు, విద్యార్ధులు, యువత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో లక్షలాది మందితో నిర్వహించిన ర్యాలీ అపూర్వమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఆంధ్రా ప్రజలు అందించిన స్వాగత సత్కారాలకు జీవితాంతం ఈ స్వాగతాన్ని గుర్తించుకుంటానని చెప్పారు. వెలగపూడిలో నిర్వహించిన పౌరసన్మానంతో వెంకయ్య ఉబ్బితబ్బిబయ్యారు. గన్నవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ఊరేగింపుగా వెళ్లిన వెంకయ్య నాయుడు అనంతరం వెలగపూడిలో ప్రధానమంత్రి పట్టణ గృహ యోజన పథకం ద్వారా నిర్మించనున్న 2.25 లక్షల ఇళ్ల నిర్మాణ శిలాఫలకం ఆవిష్కరించారు.

అప్పుడే విడిపోవాల్సింది.....

జై ఆంధ్ర ఉద్యమంలో విజయవాడ కేంద్రంగా తాము చేసిన ఉద్యమం నాడు కేంద్రాన్ని కదిలించిందని గుర్తు చేసుకున్నారు.

వాస్తవంగా 1972లోనే ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలు నేడు అగ్రపథంలో నిలిచి ఉండేవన్నారు.

ఏపీ ప్రజల ఆశలకు, ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా, ఉప రాష్ట్రపతి పదవికి ఔనత్యం తెచ్చి, నీతి,నిజాయితీలతో ఆ పదవికి వన్నె తెచ్చేందుకు ప్రయత్నిస్తాను వెంకయ్యనాయుడు చెప్పారు. ఉపరాష్ట్రపతి పదవి తనకు మరిన్ని బాధ్యతలు తెచ్చిపెట్టిందని ఇకపై రాజకీయాలు మాట్లాడే అవకాశం లేకున్నా అభివృద్ధికి మాత్రం సహకరిస్తానని చెప్పారు. రాజ్యసభ ఛైర్మన్‌ సభా కార్యక్రమాలను సజావుగా నడిపేందుకు కృషి చేస్తానన్నారు. చట్టసభల్లో చర్చ అర్థవంతమైన అభివృద్ధిని ముందుకు తీసుకువెళుతుందన్నారు. పార్లమెంటులో విమర్శలు అర్ధవంతంగా ఉండాలని., తాము ప్రతిపక్షంలో ఉండగా కొద్ది మంది ఉన్నా కాంగ్రెస్‌ని ఎదుర్కొన్న తీరు మాకు గుర్తుందని వెంకయ్య చెప్పారు. సంఖ్యాబలంతో సంబంధం లేదు., ఎవరికి ఎవరు శత్రువులు కాదని సభలో ప్రత్యర్ధులు మాత్రమే...... అని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలన్నారు. అసెంబ్లీ., పార్లమెంటు పద్ధతిగా ఎక్కువ కాలం పాటు పనిచేయాలని ప్రజాసమస్యలను చర్చించాలని కోరుకున్నారు. సభల స్థాయిని పెంచుకోవడానికి కృషి చేయాలి.ప్రభుత్వంలో ఉన్న వారు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలి. ప్రతిపక్షంలో ఉన్న వారు కూడా స్థాయికి తగ్గట్లు ప్రవర్తించాలని అనవసరమైన వివాదాలు., విమర్శలు ఎవరికి మంచిది కాదు. మన పార్లమెంటరీయన్లు మనకు మార్గదర్శకులు.....అని ప్రణబ్‌ చెప్పిన మాటలు ప్రతి సభ్యుడు గుర్తుంచుకోవాలి. పార్లమెంటు, శాసన సభల్లో ఎంతోమంది మహనీయులు అనుసరించిన విధానాలను ఆచరించాలని పిలుపునిచ్చారు. గ్రామీణాభివృద్ధిని ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలన్నారు. వాజ్‌పాయ్‌ ప్రభుత్వంలో ప్రధానమంత్రి గ్రామ సడక్‌ని చాలామంది సహచరులు వ్యతిరేకించినా దాని ఆవశ్యకతను వివరించడంతో ఆ పథకం మొదలైందని గుర్తు చేశారు.

ఏపీకి ఎంతో చేశాను...

కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఏపీకి 5.35లక్షల ఇళ్లను ఏపీకి కేటాయించామని అమరావతి ఎక్కడ ఉందని ప్రశ్నించినా స్మార్ట్‌ సిటీలో చేర్చామని గుర్తు చేశారు. , దేశం మొత్తానికి 36లక్షల ఇళ్లు వస్తే ఒక్క ఏపీకే అన్ని ఇళ్లు దక్కాయన్నారు.దేశంలో స్వరాజ్య వస్తే సురాజ్యం వస్తుందని భావించినా., దాని ఫలితాలు మాత్రం రాలేదని వెంకయ్య చెప్పారు. ఆకలి., అవిద్య., అవినీతి, అరాచకం., అసమానతల్ని పూర్తి రూపుమాపినపుడే దేశం పూర్తిగా అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రంలో ప్రధాని., రాష్ట్రంలో ముఖ్యమంత్రి నీతి వంతంగా ఉంటే చాలదు. అట్టడుగు స్థాయి వరకు నిజాయితీగా ఉంటేనే అందరికి అభివృద్ధి అందుతాయి. ఆర్ధిక అసమాతలు పెరిగాయి. పెద్దపెద్ద భవనాలు, స్టార్‌ హోటళ్లు వస్తున్నా పేదరికం మాత్రం పెరుగుతూనే ఉంది. ఆఖరి పంక్తిలో ఉన్న వారి వరకు అభివృద్ధి అందే రోజు రావాలని చెప్పారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు తగిన న్యాయం చేసేందుకు తన వంతు ప్రయత్నం తాను చేశానని లోక్‌సభలో మూడ్రోజుల పరిణామాలు చూసి తన వంతు కృషి చేశానన్నారు.. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో 623 జిల్లాలు పర్యటించానని., రాష్ట్రం ఏర్పడిన తక్కువ సమయంలో ఏపీకి జరిగినంత అభివృద్ధి ఎక్కడ జరగలేదన్నారు. ఐఐటి., ఐఐఎం., పెట్రో ‍యూనివర్శిటీ., ఎయిమ్స్‌., ట్రిపుల్‌ఐటి వంటి విద్యాసంస్థలన్ని రావడం రికార్డని., అయితే ఇది రాష్ట్ర ప్రజల హక్కు అని., దాని కోసం తన వంతు ప్రయత్నం తాను చేశానన్నారు. ఏపీకి అన్యాయం జరిగినందున దానిని సరిదిద్దే ప్రయత్నం చేశానని దానిపై వెంకయ్య ఏపీకి మాత్రమే మంత్రా అనే విమర్శలు కూడా వచ్చాయన్నారు. కాని ఏపీ కూడా దేశంలో భాగమని తాను ఎదురు సమాధానం ఇచ్చానని రాష్ట్ర ప్రయోజనాల కోసం చివరి వరకు కృషి చేసినట్లు చెప్పారు.

ఆంధ్రా ప్రజల ముద్దుబిడ్డ వెంకయ్య

వెంకయ్యను సన్మానించుకోవడం అరుదైన సందర్భమని చంద్రబాబు నాయుడు చెప్పారు. 13 వ ఉప రాష్ట్రపతి గా ఎంపిక అయిన వెంకయ్య నాయుడు తెలుగు బిడ్డ కావడం గర్వకారణమన్నారు. 1978 లో వెంకయ్య నాయుడు, తాను ఒకేసారి శాసన సభకు ఎన్నికయ్యామన్నారు. దక్షిణ భారతదేశంలో దేశానికి నాయకత్వం వహించదగిన వ్యక్తి వెంకయ్య నాయుడు అని కితాబిచ్చారు. రాష్ట్ర విభజన ఏకపక్షంగా జరుగుతున్న సమయంలో స్పందించి రాష్ట్రానికి అండగా నిలిచారన్నారు. స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్ కు వెంకయ్య నాయుడు చేసిన కృషి ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి అసమాన ప్రతిభ చూపిన గొప్ప వ్యక్తి అన్నారు. వెంకయ్యనాయుడు ఆశీస్సులు, సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. వెంకయ్యనాయుడుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ప్రేమతో అపూర్వ స్వాగతం పలకడం ఢిల్లీకి రాజు అయిన తల్లికి బిడ్డ అన్న మాటకు నిదర్శనమని గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ కొనియాడారు. కేంద్ర మంత్రిగా వెంకయ్యనాయుడు ఉండటం వల్ల ఏపికి అనే సమస్యలకు పరిష్కారం దొరికిందన్నారు.

Similar News