ఆయనో మాజీ ఎమ్మెల్యే. పార్టీలోనూ...నియోజకవర్గంలోనూ చక్రంతిప్పారు. కాని రాష్ట్ర విభజనతో ఆయన రాజకీయ భవితవ్యం ఏమిటో ఎటూ తేలకుండా ఉంది. పోనీ పార్టీ మారదామన్నా ఎక్కడా నో వేకెన్సీ బోర్డు మాత్రమే కనపడుతుండటంతో ఈ ఎమ్మెల్యేలో ఆందోళన ఎక్కువయింది. ఆయనే ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన ఉగ్రనరసింహారెడ్డి ఐదేళ్ల పాటు జిల్లాలోనే చక్రం తిప్పారు. మంత్రి పదవి లేదనే మాట తప్ప ఆయన అడిగిందే తడవుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసేది. కాంగ్రెస్ యువనేత రాహుల్ తో సత్సంబంధాలుండటంతో ఉగ్ర నరసింహారెడ్డి మాట జిల్లా అంతటా చెల్లుబాటు అయ్యేది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఉగ్రనరసింహారెడ్డి రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
వైసీపీ, టీడీపీలోనూ ప్రయత్నాలు......
విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన ఉగ్ర నరసింహారెడ్డి రెండేళ్ల పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. అయితే ఇక ఏపీలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని భావించిన ఉగ్రనరసింహారెడ్డి తన రాజకీయ భవిష్యత్ కోసం ఆలోచనలో పడ్డారు. డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే కనిగిరి నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ ఇన్ ఛార్జిగా ఉండటంతో ఇంకా వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదు. కాంగ్రెస్ లో ఉన్నప్పటి పరిచయాలతో వైసీపీ నేత బాలినేని శ్రీనివాసులురెడ్డితో ఉగ్ర టచ్ లో ఉన్నారు. అయితే కనిగిరి టిక్కెట్ ఆయనకు వస్తుందన్న గ్యారెంటీ మాత్రం లభించలేదు. దీంతో టీడీపీలో చేరేందుకు కూడా ప్రయత్నం చేశారు. కాని అక్కడ ఎమ్మెల్యేగా కదిరి బాబూరావు ఉండటంతో అసలు అవకాశమే లభించలేదు. దీంతో ఉగ్రనరసింహారెడ్డి ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నారు. వైసీపీ నుంచి కాల్ వస్తుందన్న నమ్మకంతో ఉగ్రనరసింహారెడ్డి ఉన్నారు.