ఉద్యోగులకు ఝలక్ ఇచ్చిన నీరవ్ మోడీ

Update: 2018-02-21 13:12 GMT

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చు టోపీ పెట్టి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ తన సంస్థల ఉద్యోగులకు లేఖ రాశారు. ఈ-మెయిల్ ద్వారా ఈ లేఖను పంపించారు. ఇది అధికారిక లేఖేనని ఆయన తరపు న్యాయవాదుల బృందం ధృవీకరించింది. ‘‘సమీప భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది’’ అంటూ ప్రారంభమైన ఈ లేఖలో తన సంస్థలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు, రూ.5,700 కోట్ల విలువైన చరాస్తుల స్వాధీనం గురించి ప్రస్తావించారు పంజాబ్ నేషనల్ బ్యాంకు తనపై ఫిర్యాదు చేయడం వల్ల ‘‘మన సంస్థ ఇబ్బందులు పడుతోంది’’ అని తెలిపారు.

మంచిరోజులొచ్చినప్పుడు....

ప్రస్తుతం, అన్ని ఫ్యాక్టరీలు, షోరూముల్లోని స్టాక్స్‌ను స్వాధీనం చేసుకోవడం, బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం వల్ల మీ బాకీలను, జీతాలను చెల్లించే పరిస్థితిలో తాను లేనని, మీరు వేరే ఉద్యోగ అవకాశాల కోసం అన్వేషించడం మంచిదని పేర్కొన్నారు. దర్యాప్తు వేగంగా జరుగుతున్న తీరుపై నీరవ్ మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మంచిరోజులొచ్చినప్పుడు మనం మళ్లీ కలుసుకుందామని ఆశిస్తున్నానని, స్టాక్స్, బ్యాంక్ ఖాతాలు తన చేతికి వచ్చిన వెంటనే చెల్లించాల్సిన బకాయీలు చెల్లిస్తానని నీరవ్ మోడీ ఆ లేఖలో స్పష్టం చేశారు. నీరవ్ మోడీకి చెందిన సంస్థలన్నింటీనీ స్వాధీనంచేసకోవడంతో వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడిన సంగతి తెలిసిందే.

Similar News