ఎస్‌బిఐ దొడ్డి దారిన దోపిడి

Update: 2017-08-23 18:29 GMT

దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్‌ వ్యవస్థగా అవతరించిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వినియోగదారుల నడ్డి విరుస్తోంది. అదే సమయంలో ఖాతాదారులను కూడా గణనీయంగా కోల్పోతోంది. కొద్ది నెలల క్రితం ఎస్‌బిఐలో అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ పూర్తైంది. దీంతో దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్‌ వ్యవస్థగా ఎస్‌బిఐ అవతరించింది. అదే సమయంలో బ్యాంక్‌ సేవలపై రకరకాల ఆంక్షలను ఎస్‌బిఐ అమల్లోకి తీసుకువచ్చింది. ఇందులో మినిమం బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఒకటి. నిజానికి గత మార్చి చివరి వరకు సేవింగ్స్‌ అకౌంట్స్‌లో కనీస నిల్వ పరిమితి అంటూ ఏమి లేదు. అనూహ్యంగా దానిని కనీసం 5వేల కనీస నిల్వను ఎస్‌బిఐ అమల్లోకి తీసుకువచ్చింది. నెల మొత్తం కనీసం రూ.5వేలు అకౌంట్‌లో ఉండాలి లేకుంటే ఒక రోజులో లక్షన్నర ఉండాలి. నెలమొత్తం నిల్వగా ఒక ఖాతాలో లక్షన్నర రుపాయలు అకౌంట్‌లో ఉండాలన్నది ఎస్‌బిఐ కొత్త నిబంధన. మరి వేతన జీవులు., చిన్న ఉద్యోగులు తమ జీతాల్లో రూ.5వేలను ఎప్పుడు వాడకుండా బ్యాంకులో ఉంచడం సాధ్యమయ్యే పనేనా..... అదంతా మాకు సంబంధం లేని విషయమని ఎస్‌బిఐ మొండిగా వసూళ్లు మొదలుపెట్టింది. నిజానికి నెలల తరబడి పొదుపు ఖాతాల్లో డబ్బు ఉన్నా బ్యాంకులు ఇచ్చే వడ్డీ అంతంతమాత్రమే. ఎస్‌బిఐ అనుసరిస్తోన్న నిబంధనపై సమాచార హక్కు ద్వారా తెలుగు పోస్ట్‌ ఆసక్తికరమైన సమాచారాన్ని సేకరించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత కనీసనిల్వ నిబంధన కింద ఎంత వసూలు చేశారో తెలిస్తే దిమ్మ తిరిగి పోతుంది. దేశవ్యాప్తంగా 399.74లక్షల ఖాతాదారుల నుంచి రూ.235కోట్లను కనీస నిల్వ ఉంచనందుకు జరిమానాగా వసూలు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎస్‌బిఐలోనే అత్యధికంగా కనీస నిల్వగా రూ.5వేల నిబంధన ఉంది. మిగిలిన బ్యాంకుల్లో కూడా కనీస నిల్వ నిబంధన ఉన్నా ఈ స్థాయిలో లేవు. మూడు నెలలకోమారు మంత్లీ యావరేజ్‌ బ్యాలెన్స్‌ ఛార్జీల కింద ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. ప్రధానంగా మెట్రో నగరాలు., పట్టణ ప్రాంతాల్లో మినిమం నిబంధనతో ఖాతాదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో బ్రతికే వేతన జీవులు., మధ్యతరగతి ప్రజలు., పింఛన్ల మీద బ్రతికే వారు విద్యార్ధులు, చిన్న వ్యాపారులు., రైతులు ఈ నిబంధన బారిన పడుతున్నారు. మెట్రో., అర్బన్‌., సెమీ అర్బన్‌., రూరల్‌ అంటూ బ్యాంకులు వర్గీకరించి ఛార్జీలు బాదుతున్నాయి. ఎస్‌బిఐలో నగరాల్లో రూ.5వేలు., పట్టణ ప్రాంతాల్లో మూడు వేలు, నగరాల్లో రూ.2వేలు., గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మినిమం బ్యాలెన్స్‌గా ప్రకటించింది.

మూతబడుతున్న ఖాతాలు.....

యావరేజ్‌ మంత్లీ బ్యాలెన్స్‌ నిబంధనతో బ్యాంకులకు భారీగా ఆదాయం వస్తున్నా అదే సమయంలో ఖాతాలు కూడా భారీగానే మూతబడుతున్నాయి. తెలంగాణలో దాదాపు 5259 బ్యాంకుల్లో 5.05కోట్ల ఖాతాలున్నాయి. ఏపీలో 6.6కోట్ల ఖాతాలున్నాయి. ఎస్‌బిఐ ఇటీవల ఒక బ్యాంకులో ఒకే ఖాతా నిబంధనను కూడా అమల్లోకి తీసుకువచ్చింది. ఒకే వ్యక్తి వేర్వేరు బ్రాంచిలలోనైనా ఒకటికి మించి ఖాతాలను నిర్వహించడానికి అనుమతించడం లేదు. ప్రతి అకౌంట్‌ను ఆధార్‌కు అనుసంధానించడంతో డూప్లికేట్‌ అకౌంట్లను మూసివేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల ఖాతాల వల్ల తమకు నష్టం వాటిల్లుతోందని దానిని ప్రభుత్వమే భరించాలని ఇటీవల బ్యాంకులు ప్రభుత్వానికి లేఖలు కూడా రాశాయి.

తలతిక్క నిబంధనలు.....

ఎస్‌బిఐ అమల్లోకి తీసుకువచ్చిన నిబంధనతో జూన్‌ నాటికి లక్షల ఖాతాలను రద్దు చేసుకున్నారు. వీటిలో అత్యధికంగా ఏపీలో 18లక్షల 19వేల ఖాతాలు మూతబడ్డాయి. తెలంగాణలో 3.49లక్షల ఖాతాలు మూతబడ్డాయి. దేశం మొత్తం మీద కోటి 96లక్షల 901 ఖాతాలు ఎస్‌బిఐ కొత్త నిబంధనల కారణంగా మూతబడ్డాయి.

Similar News