ఏపీలో పీకేలు పనిచేయరా....?

Update: 2017-08-28 14:30 GMT

ఏపీలో ఎన్నికల ప్రచారకర్తలకు అవకాశం లేదా..... ఉత్తరాది రాజకీయాలకు., దక్షిణాది రాజకీయాలకు పొంతన ఉండదా...., స్థానిక పరిస్థితులే అభ్యర్ధుల ఫలితాలను శాసిస్తాయా..... నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలపై ఇప్పుడిదే చర్చ...... నంద్యాల ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి చాలా దూకుడు ప్రదర్శించారు. ముఖ్యమంత్రిని దుర్భాషలాడారు. హామీలను నెరవేర్చనందుకు నడిరోడ్డుపై కాల్చి చంపినా తప్పు లేదన్నారు., ప్రజల్ని మోసం చేసినందుకు ఊరి తీయాలన్నారు.... ఇలాంటి కఠినమైన పదజాలం జగన్‌ గతంలో వాడిన దాఖలాలు లేవు. కాని జగన్‌ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిషోర్‌ను నియమించుకున్నాక బహిరంగ వేదికలపై ఇలాంటి మాటలు వాడటం వెనుక ఎవరి ప్రమేయం ఉందన్నది అసలు ప్రశ్నగా మారింది.

జగన్ వ్యాఖ్యలకు పీకేయే కారణమా?

కాల్చి చంపాలి అనే మాటకు బాధ్యుడు పీకేనా, తానా అన్నది జగన్‌ తేల్చుకోవాలి. ఒక పార్టీని ., వ్యక్తిని అంచనా వేసేపుడు ఆయన వాడే మాటలు కూడా ఓటర్లు గుర్తుంచుకుంటారు. ఎన్నికల ప్రచారంలో జగన్‌ వాడిన మాటలు జగన్ తప్పా., అతని వ్యూహకర్త తప్పా అన్నది వారే తేల్చుకోవాలని బీజేపీ సీనియర్‌ నాయకుడు యడ్లపాటి రఘుబాబు చెప్పారు. ఖచ్చితంగా జగన్‌ ఓటమికి అతని వ్యూహకర్తలు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇక ఏపీలో వ్యూహకర్తలకు అవకాశం లేదని టీడీపీ అధికార ప్రతినిధి సాయి అన్నారు. పీకేకు ఏపీ రాజకీయాలు ఏమి తెలుసని.,వైసీపీ ప్లీనరీలో చెప్పకుండా నంద్యాలను జిల్లాగా చేస్తామని ఎన్నికల ప్రచారంలో ఎందుకు చెప్పారన్నారు. ప్లీనరీలో లేని హామీలు ఎన్నికల ప్రచారంలో చేయడం తప్పే., వారి తప్పులే టీడీపీకి కలిసొచ్చాయి. రెచ్చగొట్టే ప్రయత్నాలు తప్ప ప్రజలకు ఏమి చేద్దమన్నది జగన్‌ మర్చిపోయాడని టీడీపీ ఎద్దేవా చేసింది.

Similar News