ఒంగోలు వైసీపీ రాజకీయం రసకందాయంలో పడింది. వైసీపీ నేతల్లో విబేధాలు ముదిరి పాకానపడుతున్నాయి. బావ కళ్లలో ఆనందం పక్కన పెడితే., బావ బామ్మర్దుల్లో ఎవరో ఒకరే ఉండాలన్నట్లు సాగుతున్న పోరు పార్టీ శ్రేణుల్ని విస్మయానికి గురి చేస్తోంది. ఏపీలో కడప తర్వాత వైఎస్ కుటుంబానికి అంత పట్టున్న జిల్లా ఒంగోలు. వైఎస్ తోడల్లుడు వైవీ సుబ్బారెడ్డి., మరో బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డిలు జిల్లా రాజకీయాల్లో ఇన్నాళ్లు చక్రం తిప్పుతూ వచ్చారు. 2014 ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ఎంపీగా గెలిస్తే., వైవీ సుబ్బారెడ్డి చెల్లెలి భర్త బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోయాడు. దీంతో బావ బామ్మర్దుల మధ్య విబేధాలు మొదలయ్యాయి.
ఎమ్మెల్సీ పదవి కోసం....
నిజానికి 99 ఎన్నికల్లో పిసిసి అధ్యక్షుడిగా వైఎస్ ఉన్న సమయంలో బాలినేనికి పార్టీ టిక్కెట్ ఇప్పించింది వైవీ సుబ్బారెడ్డి అని చెబుతారు. ఆ తర్వాత 2004లో వైఎస్ క్యాబినెట్లో మంత్రిపదవి కూడా బాలినేనికి దక్కింది. వైఎస్ మరణం తర్వాత బాలినేని కూడా జగన్ వెంట నడిచాడు. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో దామచర్ల జనర్ద న్ మీద 15వేల ఓట్ల ఆధిక్యంతో బాలినేని గెలుపొందాడు. 2014 ఎన్నికల సమయంలో వైవీ సుబ్బారెడ్డికి ఎంపీ టిక్కెట్ దక్కకుండా చివరి వరకు బాలినేని ప్రయత్నించారని చెబుతారు. అయితే 2014 ఎన్నికల ఫలితాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన బాలినేని., దామచర్ల చేతిలో 25వేల ఓట్ల తేడాతో ఓటమి పాలైన తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఓ దశలో బాలినేని టీడీపీలో చేరతారని విస్తృత ప్రచారం కూడా జరిగింది. అయితే ప్రకాశం జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో ఆ ప్రచారానికి తెరపడింది. తాజాగా ఎమ్మెల్సీ పదవి కావాలని బాలినేని ఒత్తిడి చేస్తున్నారట. అయితే పార్టీ అధ్యక్షుడు జగన్ మాత్రం కాపు సామాజిక వర్గ నేతలకు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని భావిస్తుండటతో బాలినేని పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నెల 20న కిడ్నీ బాధితుల్ని పరామర్శించేందుకు ముందు రోజు రాత్రి కందుకూరులో జగన్ బస చేశారు. అయితే జిల్లా పార్టీ అధ్యక్షుడు బాలినేని మాత్రం తీరిగ్గా పరామర్శకు బయల్దేరే ముందు పది గంటల సమయంలో గెస్ట్‌హౌస్‌కు రావడంతో జగన్ అతనిని కనీసం పలకరించలేదట. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాలినేని కనీస బాధ్యతతో పనిచేయట్లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారట., బాధితుల్ని పరామర్శించిన తర్వాత దాదాపు 90నిమిషాలు జగన్ మాట్లాడితే అందులో పది సార్లు బాబాయ్ పేరు మాత్రమే ప్రస్తావించడం కూడా బాలినేనిపై జగన్ ఆగ్రహానికి అద్దం పట్టింది. వైవీ సుబ్బారెడ్డి జిల్లా రాజకీయాల్లో ఉంటే తన ప్రాబల్యం తగ్గిపోతుందనే భావన బాలినేనిలో ఉండటం వల్లే ఇలా వ్యవహరిస్తున్నారని జిల్లా నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన పోతుల రామారావు., డేవిడ్ రాజు., గొట్టిపాటి., అశోక్‌రెడ్డిల వెనుక బాలినేని ప్రోద్భలం ఉందనే గుసగుసలు ఉన్నాయి. ఇవన్ని జగన్‌కు చేరడంతో వాటికి తెరదించాలని నిర్ణయించుకున్నారట.