కమలం పార్టీ కొత్తవారితో కళకళ లాడనుందా?

Update: 2017-08-24 14:30 GMT

పార్టీ ఉచ్ఛస్థితికి ఎదగాలంటే కొత్తవారికి అవకాశమివ్వాలి. ఇప్పటి వరకూ ఆ అవకాశం ఇవ్వకపోవడం వల్లనే పార్టీ ఎదగలేదు. అందుకే కొత్తవారెవరూ పార్టీలోకి రావడం లేదు. అందుకే కొత్త వారు పార్టీలోకి వచ్చినా సర్దుకు పోవాలి. ఇగోలు వదిలిపెట్టాలి. ఇదీ తెలంగాణ బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో సీనియర్ నేతలు చేసిన వ్యాఖ్యలు. పార్టీని తెలంగాణలో బలోపేతం చేయాలంటే ఇతర పార్టీల నేతలను కూడా తీసుకోక తప్పదని బీజేపీ రాష్ట్ర నేతలు చెప్పకనే చెప్పారు. కొత్త నేతల చేరికతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తాము జాగ్రత్తలు తీసుకుంటామని కూడా ఆఫీస్ బేరర్లకు హామీ ఇచ్చింది. తాజాగా జరిగిన ఆఫీస్ బేరర్ల సమావేశంలో సీనియర్ నేతల వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే కమలం పార్టీ కొత్త వారికి త్వరలోనే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం చెప్పేందుకు సిద్ధమయిందని తెలుస్తోంది. సెప్టంబర్ నెలలో తెలంగాణ బీజేపీలో ఇతర పార్టీల నేతలు పెద్దయెత్తున చేరతారన్న ప్రచారం జరుగుతోంది. అమిత్ షా గతంలో తెలంగాణలో పర్యటించినప్పుడు కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. కాని అమిత్ షా మూడు రోజుల టూర్లో ఏ పార్టీ నేత చేరలేదు.

సెప్టంబరులో భారీగా చేరికలు......

అయితే సెప్టంబరు నెలలో అమిత్ షా మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా చేరికలు ఉంటాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి నేతలు తమ పార్టీలో అమిత్ షా సమక్షంలోనే చేరతారని పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ సయితం అంగీకరించారు. సెప్టంబరు నెలలో తేదీ ఖరారు కాకున్నా షా రాక ఖాయమని బీజేపీ నేతలుచెబుతున్నారు. దీంతో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో గుబులు బయలుదేరింది. ఈసారి పార్టీలో భారీగానే చేరికలు ఉంటాయని బీజేపీ నేతలు బహిరంగంగానే చెబుతుండటంతో ఎవరా నేతలన్న ఆసక్తి సర్వత్రా పెరిగింది. ఎక్కువ మంది మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు ఉంటారని ఒక బీజేపీ నేత వ్యాఖ్యానించడం విశేషం. అయితే కొత్తనేతలు పార్టీలోకి వస్తే తమ పరిస్థితి ఏంటన్న ఆందోళన బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. అయితే ఢిల్లీ నుంచి మాత్రం పార్టీలోకి ఎవరొచ్చినా చేర్చుకోవాల్సిందేనని సంకేతాలు రావడంతో పార్టీలో చేరే వారి జాబితాను, వారి బయోడేటాను రాష్ట్ర నాయకత్వం రెడీ చేస్తోంది. పార్టీలోకి వచ్చే కొత్త వారిని కలుపుకుని పోవాలని, వారు కూడా రాష్ట్రస్థాయి నేతలేనని, పార్టీ కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యులవుతారని అమిత్ షా చెప్పడంతో కొందరు అప్పుడే డీలా పడిపోయారు. అధిష్టానం నుంచి క్లియర్ సిగ్నల్స్ రావడంతో కాషాయ కండువాలు సిద్ధం చేస్తున్నారు బీజేపీ నేతలు.

Similar News