కీలకమైన కాకినాడ ఎన్నికల్లో విజయం కోసం తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు . బాబు చివరి రెండు రోజులు కాకినాడ ప్రచారంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు . ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన చంద్రబాబు వైసిపి పై విమర్శల వర్షం , ఓటర్లపై వరాలు కురిపిస్తున్నారు . అలాగే అభివృద్ధి మంత్రం , స్మార్ట్ సిటీ ప్రచారం ముమ్మరంగా చేస్తూ కాకినాడ అభివృద్ధి చెందాలి అంటే టిడిపికి ఓటు వేయాలనే ప్రచారం సాగిస్తున్నారు .
రాజకీయ పిచ్చి కుక్కలతో ప్రమాదం ...
చంద్రబాబు నంద్యాల ఎన్నికల ప్రచారం మాదిరి కాకుండా కాకినాడ లో తన శైలి మార్చారు . తననే కాల్చి చంపుతా అన్నవారు రేపు ప్రజల్ని అలాగే చేస్తారంటూ వ్యాఖ్యానించారు .కాకినాడలో పందులు కుక్కల సమస్య ఉందని అయితే అది పరిష్కరిస్తామని కానీ రాజకీయ పిచ్చి కుక్కలు కరిస్తే అత్యంత ప్రమాదం అంటూ సెటైర్లు విసిరారు .
జగన్ ప్రచారం లేనట్టేనా ...?
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం అనంతరం అస్వస్థత కు లోనైన వైఎస్ జగన్ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి ఇక రాకపోవొచ్చని భావిస్తున్నారు . తీవ్రమైన జ్వరం , జలుబు తో బాధపడుతున్న జగన్ వైద్యుల సలహా మేరకు స్థానిక ఎన్నికలకు ప్రచారం చేయకపోవొచ్చని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి . ఆదివారంతో ప్రచారం పూర్తి కానుండటంతో ఇక జగన్ రాక లేనట్లే అంటున్నారు .
ఆకట్టుకుంటున్న రోజా ...
ఇప్పుడు వైసిపి తురుపు ముక్క నగరి ఎమ్యెల్యే రోజా కాకినాడ ఎన్నికల్లో ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు . సెటైర్లు పంచ్ డైలాగ్స్ తో ఓటర్లను తనదైన శైలీలో ఆకట్టుకుంటున్నారు . టిడిపి పైన , చంద్ర బాబుపై రోజా విసురుతున్న పంచ్ లకు జనం నుంచి కూడా మాంచి స్పందనే లభిస్తుంది .