కాకినాడ టీడీపీలో ఏం జరుగుతోంది?

Update: 2017-08-26 12:30 GMT

తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు మంత్రులున్నారు. అందులో సీనియర్ మంత్రి యనమల ఒకరు. మరొకరు హోంమంత్రి చినరాజప్ప. అయితే వీరిద్దరిని పక్కన పెట్టి గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక పర్యవేక్షణ బాధ్యతను అప్పగించడం పార్టీలో చర్చనీయాంశమైంది. మంత్రి యనమల రామకృష్ణుడు ప్రచారానికి పెద్దగా తిరగ లేకపోవడంతో ఆయనను చంద్రబాబు పక్కన పెట్టారని తెలుస్తోంది. ఇక హోంమంత్రి చినరాజప్ప వ్యవహారం పార్టీలో కొందరి నేతలకు మింగుడు పడటం లేదు. కాకానాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారులో చినరాజప్పపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన కొందరి మాటలు విని అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించారని చెబుతున్నారు. అందుకోసం నిన్నటి వరకూ ఎన్నికను పూర్తిగా పర్యవేక్షించిన చినరాజప్పను ప్రస్తుతం ప్రచారానికే పరిమితం చేసినట్లు తెలుస్తోంది.

ఆరుగురు నేతలపై వేటు......

ిఇక రెబల్స్ ను ప్రోత్సహించారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో ఆయన వర్గం కారాలు మిరియాలు నూరుతోంది. సీట్ల పంపకాల్లో సిటీ ఎమ్మెల్యే అయిన తనకే ప్రాధాన్యం ఇవ్వలేదని వనమాడి సన్నిహితుల వద్ద వాపోతున్నారు. తాను చెప్పినా వినకున్నా పోటీచేస్తే తానేం చేయగలనని వనమాడి ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మిత్రపక్షమైన బీజేపీకి కేటాయించిన వార్డుల్లో రెబల్స్ గా పోటికి దిగిన ఆరుగురు టీడీపీ నేతలను పార్టీ ఆదివారం సస్పెండ్ చేసింది. హైకమాండ్ చెబుతున్నా పోటీకి దిగడంపై చంద్రబాబు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎవరైనా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. మొత్తం మీద కాకినాడ ఎన్నికల్లో టీడీపీలో అంతర్యుద్ధం ప్రారంభమైంది.

Similar News