కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతల నుంచి ఆ మంత్రిని ఎందుకు తప్పించారు? నిన్న మొన్నటి వరకూ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో హల్ చల్ చేసిన పొరుగు జిల్లాకు చెందిన మంత్రిని అధిష్టానం పక్కన పెట్టిందా? అవును. మంత్రి చేసిన వ్యాఖ్యలతో ఒక సామాజిక వర్గం చిన్నబుచ్చుకుంది. వారంతా టీడీపీకి వ్యతిరేకంగా ఓటేయాలనుకుని తీర్మానం చేశారు. దీంతో ఈ విషయం పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆ మంత్రిని కాకినాడ నుంచి వెనక్కు రావాలని ఆదేశించారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు ఈ నెల 29వ తేదీన జరగనున్నాయి. తెలుగుదేశం, బీజేపీలు కలిసి ఇక్కడ పోటీ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ 39 డివిజన్లలోనూ, బీజేపీ 9 డివిజన్లలోనూ అభ్యర్థులను పోటీకి దింపింది. అయితే కాకినాడలో ఉన్న ఒక సామాజిక వర్గానికి టీడీపీ ఒక సీటు కూడా కేటాయించకపోవడంతో ఆ వర్గం ఆగ్రహం వ్యక్తంచేసింది. సదరు మంత్రితో సమావేశమై తమ వర్గానికి టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదని నిలదీసింది.
మంత్రి ఆగ్రహంతో కులపెద్దల పంచాయతీ.....
దీంతో ఆగ్రహించిన సదరు మంత్రి ‘మీకున్న ఓట్లెన్ని? మీ వల్ల ఏం ఉపయోగం? ఓట్లున్న కులాలకే ఎక్కువ సీట్లు ఇస్తాం. మీకు సీటు లేదు వెళ్లండి’ అంటూ హుంకరించారు. దీంతో మంత్రి ఆగ్రహాన్ని చూసిన ఆ కులపెద్దలు వంద మంది వరకూ షాక్ తిన్నారు. వెంటనే కాకినాడలోని ఓ హోటల్ లో సమావేశమై తమ కులం ఓట్లన్నీ టీడీపీకి వేయకూడదని నిర్ణయించారు. అయితే ఆ సమావేశం నుంచే టీడీపీ మంత్రి యనమల రామకృష్ణుడుకు ఫోన్ చేసి ఈవిషయం ఎవరో చెప్పారు. దీంతో మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప నష్ట నివారణ చర్యలు చేపట్టారు. అయితే మంత్రిని నేరుగా ఏమీ అనలేక, ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చంద్రబాబు ఆ మంత్రిని వెనక్కు రప్పించి ఆయన స్థానంలో మరో మంత్రి పితాని సత్యనారాయణను పంపారట. ఇదండీ మంత్రులే ఓట్ల సంఖ్యను బట్టి అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే జనాలు ఊరుకుంటారా? తిరగబడరూ?