నంద్యాల మాదిరిగానే కాకినాడ కార్పొరేషన్ ను అధికార తెలుగుదేశం పార్టీ సీరియస్ గా తీసుకుంది. కాకినాడ కార్పొరేషన్ పై ఎలాగైనా పసుపు జెండా ఎగరేయాలనుకుంటున్న టీడీపీ అందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నిక తర్వాత కాకినాడపైనే కాన్సన్ ట్రేట్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయడానికి ఈ ఎన్నిక ఉపయోగపడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అతి పెద్ద జిల్లాలో ఈసారి కూడా ఎక్కువ సంఖ్యలో అసెంబ్లీ సీట్లు సాధించాలంటే కాకినాడ కార్పొరేషన్ ను గెలవాల్సిందేనని చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలను ఆదేశించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్ష కొనసాగుతుండటంతో చంద్రబాబు ఈ ఎన్నిక విషయంలో అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 29వ తేదీన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 48 డివిజన్లకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ 39 డివిజన్లలో పోటీ చేస్తోంది.
ప్రతి ఐదు డివిజన్లకు ఒక మంత్రి.....
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు కూడా సీనియర్ మంత్రులను బాధ్యులుగా నియమించారు. ప్రతి ఐదు డివిజన్లకు ఒక మంత్రిని ఇన్ ఛార్జిగా నియమించారు. ఆ అయిదు డివిజన్లనూ మంత్రి దగ్గరుండి పర్యవేక్షించాల్సి ఉంటుంది. మంత్రులు కళావెంకట్రావు, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు, పితాని సత్యనారాయణలను ఇన్ ఛార్జిలుగా నియమించారు. వీరంతా ఇప్పుడు కాకినాడలోనే మకాం వేసి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల 27వ తేదీతో కాకినాడలో ప్రచార గడువు ముగుస్తుండటంతో చంద్రబాబు కూడా రెండు రోజుల పాటు కాకినాడలో ప్రచారం చేయనున్నారు. ఈ కార్పొరేషన్ చేజిక్కించుకుంటే తూర్పులో పట్టు సాధించినట్లేనని వైసీపీ కూడా భావిస్తుంది. అందుకే టీడీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి వార్డుకు ఒక ఎమ్మెల్యేను నియమించారు. సామాజిక వర్గాల వారీగా నంద్యాల మాదిరిగానే ఇక్కడ కూడా నేతలు తిష్టవేయడంతో కాకినాడ పట్టణం కోలాహలంగా మారింది.