కాకినాడలో నువ్వా? నేనా?

Update: 2017-08-25 04:30 GMT

కాకినాడ మునిసిపల్‌ ఎన్నికల ప్రచారానికి నాలుగు రోజులే గడువు ఉండటంతో వైసీపీ-టీడీపీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. టీడీపీ తరపున డివిజన్ల వారీగా రాష్ట్ర మంత్రులు ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకున్నారు. మంత్రులు చినరాజప్ప., ప్రత్తిపాటి పుల్లరావు., కళా వెంకట్రావు., కొల్లు రవీంద్ర., పితాని సత్యనారాయణ., జవహార్‌., ఎంపీలు తోట నరసింహం., ఆవంతి శ్రీనివాస్‌., రామ్మోహన్‌ నాయుడు., పలువురు ఎమ్మెల్యేలు., ఎమ్మెల్సీలు ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. టీడీపీ మిత్ర ధర్మాన్ని పాటించడం లేదని బీజేపీ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్ధులు బరిలో ఉన్న పలు డివిజన్లలో రాష్ట్ర మంత్రులు ప్రచారం నిర్వహించారు. 47వ డివిజన్‌లో టీడీపీ రెబల్‌కు ఆ పార్టీ మద్దతు ప్రకటించడంపై బీజేపీ నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో మంత్రులు చినరాజప్ప., పుల్లారావులు బీజేపీ అభ్యర్ధి తరపున ప్రచారం నిర్వహించారు. జిల్లా నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి., జ్యోతుల నెహ్రూలకు ఒక్కోక్కరికి 24 డివిజన్ల బాధ్యత అప్పగించారు.

దూకుడు మీదున్న వైసీపీ....

అటు వైసీపీ కూడా కాకినాడ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి., మోపిదేవి వెంకటరమణ., పార్థసారథి., లక్ష్మీ పార్వతిలు కాకినాడలో విస్త్రత ప్రచారం నిర్వహిస్తున్నారు. కాకినాడ గెలుపుపై కన్నబాబు ధీమాగా ఉన్నారు. 26వ తేదీ ఉదయం 10 నుంచి రాత్రి 10వరకు జగన్‌ ప్రచారం నిర్వహిస్తారని కన్నబాబు చెప్పారు. ఇక బీజేపీ అభ్యర్ధుల గెలుపు బాధ్యత మంత్రి మాణిక్యాల రావు భుజానికెత్తుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధులకు మద్దతుగా పళ్లం రాజు., రఘువీరాలు 26న ప్రచారం నిర్వహించనున్నారు.

Similar News