కులాలు, మతాల వారీ సమీకరణాలు ఓట్లు కురిపిస్తాయా ..?

Update: 2017-08-29 01:30 GMT

నంద్యాల కావొచ్చు , కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు కావొచ్చు కులాల వారీగా మతాల వారీగా గాలం వేసేందుకు పార్టీలు కుస్తీ పట్లు పడుతున్నాయి . ఏ మతస్థులవి ఎన్ని ఓట్లు వున్నాయి ..? ఏ కులస్థులవి ఎన్ని ? వారు తమకు అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి ? ఎలాంటి వరాలు ఇవ్వాలి ..? ఏ తాయిలాలు ప్రకటించాలి ..? ఇవే ఇప్పుడు ప్రధాన రాజకీయ పక్షాలు అనుసరించే ఎన్నికల వ్యూహాలు . ఈ ఫార్ములా క్లిక్ అయితే విజయం తమవైపే ఉంటుందని మెజారిటీ ఓటర్లు వున్న కులాల నుంచి సంఖ్యా బలం తక్కువ వున్న వారి తో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు రాజకీయ పార్టీల అధినేతల నుంచి ద్వీతీయ స్థాయి నేతల వరకు . ఈ తరహా రాజకీయాలు ఏ మేరకు ఫలిస్తాయో కానీ సమాజం పై తీవ్ర దుష్ప్రభావాన్ని ఆ తరువాత చూపిస్తున్నాయి . తమ కులానికి అత్యధిక ఓటు బ్యాంక్ ఉందని ఎన్నికల్లో తడాఖా చూపిస్తామంటూ చోటా మోటా నేతల నుంచి బడా నేతల వరకు ఎన్నికల సమయంలో గంప గుత్తగా తమ కులం అంతా తమ వైపే ఉందనే బిల్డ్ అప్ ఇస్తూ బ్లాక్ మెయిల్ చేస్తుంటారు చాలా మంది . అయినా సరే ఇదే విన్నింగ్ ఫార్ములా గా ఫాలో అయిపోతున్నారు అంతా .

అభివృద్హి , అభ్యర్థి గుణ గణాలు పక్కకు పోయాయి ...

మా పార్టీ చేస్తున్న అభివృద్ధి , చేసిన అభివృద్ధి , చేయబోయేది ఇది అని చెప్పుకోవడం అతి తక్కువగా ప్రచారాల్లో కనిపిస్తుంది . మా అభ్యర్థి ప్రత్యర్థి పార్టీలో వున్న అభ్యర్థి కన్నా చాలా ఉత్తముడు . కనుక ఆయన్ను చూసి ఓటు వేయండని పరిస్థితి కనిపించడం లేదు . అధికారపార్టీ ప్రతిపక్షాన్ని , అలాగే ప్రతిపక్షం అధికారపార్టీ ని విమర్శించుకోవడం , ఆరోపణాస్త్రాలు సంధించుకోవడం రివాజుగా మారిపోయింది . ఈ తరహా రాజకీయాలపై ప్రజల్లో అసహ్యం అసహనం పెరిగిపోతుంది . రాజకీయాల్లోకి వచ్చే వారు వ్యాపారంగా ఆ వృత్తిని భావిస్తున్నారని జనం నిర్ధారించుకుని ఓటుకు నోటు తీసుకోవడం డిమాండ్ గా మారిపోయింది . మన విలువైన ప్రజాస్వామ్యం ఇలాగే ముందుకు సాగితే చేటు తప్పదన్న ఆందోళన ప్రజాస్వామ్య వాదుల్లో పెరిగిపోతుంది .

Similar News