గజదొంగ ఖతమ్

Update: 2017-10-28 03:29 GMT

గజదొంగ భీంసింగ్ కర్నూలు జిల్లా పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. దాదాపు 144 దొంగతనాలతో సంబంధం ఉన్న వ్యక్తి భీంసింగ్. అతన్ని పట్టుకోవడం కోసం పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. సెప్టెంబర్ నెలలో కర్నూలు జిల్లా డోన్ సమీపంలో ఓబులాపురంమిట్ల దగ్గర ఒక దోపిడీ జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెలుతున్న ఓ స్కార్పియో కారులో ఒక కంపెనీకి సంబంధించి రూ. 5.5 కోట్లను సెఫ్ లాకర్లో ఉంచి తీసుకువెళుతున్న కారును కొంతమంది దుండగులు అడ్డగించి కారు డ్రైవర్, గుమస్తాను కొట్టి.. ఆ కారులోనే డబ్బును దోచుకుని పారిపోయారు. దీంతో 8 ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి దోపిడీ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. దోపిడీ చేసిన దొంగలు కారులో కర్నూలు నుంచి హైదరాబాద్‌కు వచ్చి శంషాబాద్ మీదుగా నాగ్‌పూర్ వైపు వెళ్లారని, అక్కడి నుంచి ఎక్కడకు వెళ్లిందన్నదానిపై పోలీసులు పరిశోధన చేశారు. సీసీ కెమెరాలు, మొబైల్ డేటా నెట్ వర్క్‌ను పరిశీలించారు.

ఎదురు కాల్పుల్లో....

చివరకు ఈ దోపిడీకి రాజస్థాన్‌కు చెందిన భీంసింగ్ అనే వ్యక్తి సూత్రధారి అని కర్నూలు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం కర్నూలు నుంచి స్పెషల్ పార్టీ పోలీసులు జాలోర్ జిల్లా పౌంసర్ ప్రాంతానికి వెళ్లారు. పోలీసులు తనను వెంటాడడం గమనించిన భీంసింగ్ కారు నుంచి దిగి పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో కర్నూలు పోలీసులు ప్రతిగా ఎదురుకాల్పులు జరపడంతో సంఘటన స్థలంలోనే భీంసింగ్ చనిపోయాడు. ఆయన చనిపోయిన విషయాన్ని ఆంధ్రా పోలీసులు రాజస్థాన్ పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ ఘటనలో భీంసింగ్‌తో పాటు ఉన్న మరో వ్యక్తి తప్పించుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. భీంసింగ్‌తో పాటు ఉన్న వ్యక్తి ఒకరు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. కర్నూలు ఎస్పీ కూడా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దోపిడీ దొంగ భీంసింగ్ తమ సిబ్బందిపై కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని ఎస్పీ గోపీనాథ్ జెట్టి అన్నారు.

Similar News