గోవా ఢిల్లీలలో గెలుపెవరిది?

Update: 2017-08-23 16:30 GMT

ఏపీలోని నంద్యాల ఉప ఎన్నికతో పాటు గోవాలోని వాల్పాయ్‌., పనాజీ., ఢిల్లీలోని ఎస్సీ రిజర్వ్‌ నియోజక వర్గమైన బవానా ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ పనాజీ నుంచి బరిలో దిగారు. కొద్ది నెలల క్రితం గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మనోహర్‌ పారికర్‌ పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గిరీష్‌ చోడంకర్ బరిలో ఉన్నారు. వాల్పాయ్‌లో బీజేపీ తరపు విశ్వజిత్‌ రాణే కాంగ్రెస్‌ తరపున రవి నాయక్‌ బరిలో ఉన్నారు. గోవా ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ ధీమాగా ఉంది.

ఆప్‌లో ఆందోళన.....

అటు ఢిల్లీలోని బవానా ఉప ఎన్నిక ఆప్‌లో ఆందోళన పుట్టిస్తోంది. బవానా ఉప ఎన్నికను ప్రధాని మోదీ స్వయంగా పరిశీలిస్తున్నారు. ఆప్‌ ఎమ్మెల్యే వేద్‌ ప్రకాష్‌ గత మార్చిలో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికలకు ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. ఉప ఎన్నికలో బీజేపీ తరపు మాజీ ఆప్‌ ఎమ్మెల్యే వేదప్రకాష్ బరిలో ఉన్నారు. అతని గెలుపు ఖాయమని బీజేపీ ధీమాగా ఉంది. 2015 ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లలోని 70 స్థానాల్లో ఆప్‌ 67 స్థానాల్లో గెలుపొందింది. ఆ సంఖ్య ప్రస్తుతం 65కు చేరింది. ప్రస్తుతం మూడు స్థానాల్లో ఉన్న బీజేపీ ఏప్రిల్‌ జరిగిన ఉప్ప ఎన్నికల్లో రాజౌరీ గార్డెన్‌ స్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు బవానా ఉప ఎన్నికతో ఆప్‌ భవితవ్యం తేలనుంది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌., మంత్రులు విస్త్రతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఆదివారం బవానాలో ప్రచారం నిర్వహించిన కేజ్రీవాల్‌ తమకు ఓటు వేయాలని అభ్యర్ధించారు. మరోవైపు కాంగ్రెస్‌ తరపున సురేంద్ర కుమార్‌ బరిలో ఉన్నారు. ఢిల్లీలో 15ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస‌‌ పార్టీలో సురేంద్రకుమార్‌ మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో ఒక్క సీట్‌ కూడా దక్కలేదు.

Similar News