వైసీపీ అధినేత జగన్ తన తీరు మార్చుకోరా? తానే కాబోయే ముఖ్యమంత్రినని ఎలా ప్రకటించుకుంటారు. జగన్ సంయమనం కోల్పోయి కొన్నిసార్లు పెదవి దాటుతున్న మాటలు ఆయనకు కొంప ముంచేట్లు ఉన్నట్లు పరిశీలకుల భావన. వైసీపీలోనూ ఇదే చర్చ జరగుతోంది. అధికారపార్టీకి జగన్ తరచూ అవకాశమిస్తున్నారని వైసీపీ నేతలే అంటున్నారు.
మాట పెదవి దాటితే...
రెండేళ్లలో ముఖ్యమంత్రిని అవుతా. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లే ఉంటుంది. దేవుడు దయతలిస్తే ఏడాదే ఉంటుంది. మీరందరినీ గుర్తుపెట్టుకుంటా. చూస్తా. అని జగన్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు సొంతపార్టీ నేతలతో సహా ఆశ్చర్యంలోకి నెట్టేసింది. ముఖ్యమంత్రిని అవుతానని ఆశపడటంలో తప్పులేదు. ఆత్మవిశ్వాసం ఉండటం మంచిదే. కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు ఆ ప్రకటన చేయొచ్చు. ఎవరూ కాదనరు. కాని బహిరంగంగా పోలీసుల ఎదుటే చేసిన వ్యాఖ్యలు జగన్ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉన్నాయి. 2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జగన్ వచ్చే ఎన్నికల్లో తనదే విజయమని చెప్పారు. అప్పట్లో క్యాడర్ లో ఆత్మవిశ్వాసం నింపేందుకే ఈ ప్రకటన చేశారని అందరూ భావించారు. కాని ఇటీవల తరచూ తానే ముఖ్యమంత్రినని ప్రకటించుకోవడాన్ని మేధావులు కూడా తప్పుపడుతున్నారు.
వచ్చిన సానుభూతినీ....
ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ చక్కగా వినియోగించుకున్నారు. జనసేన అధినేత విశాఖకు దూరంగా ఉన్నా జననేతగా విశాఖకు వచ్చారని అందరూ భావించారు. ఇది జగన్ కు ఖచ్చితంగా ప్లస్ పాయింటే. ఎయిర్ పోర్ట్ లో జగన్ న అడ్డుకోవడం కూడా ఆయన పట్ల సానుభూతి వచ్చింది. కాని అంతలోనే జగన్ అదుపు తప్పారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లోనే కాకుండా హైదరాబాద్ కు వచ్చి మీడియా సమావేశంలో కూడా అదే పల్లవిని అందుకున్నారు జగన్. దీంతో చూసే వారికి కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. వచ్చే ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో? ఏమో తెలియదు. కాని ఇప్పటినుంచే తాను ముఖ్యమంత్రినని ప్రకటించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటి వరకూ జగన్ వైపు ఉన్న సానుభూతి కాస్తా ఈ వ్యాఖ్యలతో కొట్టుకుపోయిందంటున్నారు. సాధారణంగా జగన్ పై అధికార పార్టీ ముఖ్యమంత్రి కుర్చీ కోసం జగన్ అర్రులు చాస్తున్నారని, ఈ పదవి కోసం రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శలు చేస్తుంది. వారి విమర్శలకు తగ్గట్లుగానే జగన్ కామెంట్స్ ఉన్నాయి.ఈ వ్యాఖ్యలను జగన్ వ్యతిరేక మీడియాతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చక్కగా ఉపయోగించుకున్నారు. జగన్ మాత్రం తన షార్ట్ టెంపర్ తో వచ్చిన అవకాశాన్ని చేజేతులా చేజార్చుకున్నారని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు. ఇప్పటికైనా జగన్ కొంత సంయమనం పాటించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.