టీడీపీకి షాకిచ్చిన సీనియర్ నటి

Update: 2017-08-24 06:30 GMT

రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ పార్టీని వీడేందుకు ఎవరూ వెనుకాడటం లేదు. కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు తమను వాడుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత కరివేపాకులా విసిరేస్తున్నారని ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీలో కొందరు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తాజాగా సీనియర్ సినీనటి కవిత తాను టీడీపీలో కొనసాగలేనని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్ల పాటు టీడీపీ అధికారానికి దూరంగా ఉన్నప్పుడు కవిత ఆ పార్టీ కోసం తీవ్రంగానే శ్రమించారు. మహిళ నేతగా పేరున్న కవిత ఎన్నో సమస్యలపై అప్పటి అధికార పార్టీపై ఉద్యమించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వద్ద కూడా కవితకు మంచి స్థానమే ఉంది. రోజా పార్టీని వీడి వెళ్లినా... తాను మాత్రం పార్టీని అంటిపెట్టుకునే ఉంటూ వస్తున్నారు.

తనను కావాలనే దూరం పెట్టారని......

అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తనను పట్టించుకోవడం లేదన్నది కవిత ఆరోపణ. కష్టకాలంలో ఉన్నప్పుడు తన అవసరం ఉన్నట్లు ప్రవర్తించారని, కాని అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలు తానెవరో తెలియనట్టేల ప్రవర్తిస్తున్నారని కవిత చెబుతున్నారు. ఇటీవల విశాఖలో జరిగిన మహానాడులో సయితం కవిత సభ వేదికపై చోటు కల్పించ లేదన్న కారణంతో మధ్యలోనే బయటకు వచ్చేశారు. ముఖ్యంగా ఆర్యవైశ్య కులానికి చెందిన కవిత తాను తెలుగుదేశం పార్టీలో కొనసాగలేనని నెల్లూరు టౌన్ హాలులో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పడం విశేషం. టీడీపీలో అయితే ఉండలేనని చెప్పిన కవిత, తాను ఏ పార్టీలో చేరేది చెప్పలేదు.

Similar News