డేరా బాబా వ్యవహారంపై స్వయంగా రంగంలోకి దిగిన మోడీ

Update: 2017-08-27 18:29 GMT

గుర్మీత్‌ రాంరహీమ్‌ సింగ్‌ వ్యవహారంలో అల్లర్లకు పాల్పడిన వారు ఎవరిని వదిలిపెట్టేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మనక్‌బాత్‌లో ప్రసంగించిన మోదీ చట్టం ముందు అంతా సమానమేనని చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఎవరిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. చండీఘడ్‌కు 15కి.మీల దూరంలో ఉన్న పంచకుల వంటి శాంతియుతమైన గ్రామంలో చెలరేగిన విధ్వంసంపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు. గుర్మీత్‌ అనుచరుల చర్యలు ఏమాత్రం అమోద యోగ్యం కాదన్నారు. గాంధీ., బుద్దుడు వంటి వారు జన్మించిన నేలపై హింసకు ఏమాత్రం తావు లేదని దీనిని ఏమాత్రం జాతి సహించదన్నారు. విధ్వంసక చర్యలకు పాల్పడే వారు ఎవరైనా., ఏ సంస్థలైనా ఉక్కు పాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. అలాంటి చర్యల్ని ఏ ప్రభుత్వం సమర్ధించదని., దేశ ప్రజలంతా పూర్తి భద్రతతో జీవించే చర్యలకు విఘాతం కలిగిస్తే సహించనని మోదీ స్పష్టం చేశారు.

ఇప్పటికే 36 మంది మృతి........

అత్యాచార అభియోగాలు నిర్ధారితమైన తర్వాత హర్యానాలో చెలరేగిన అల్లర్లో ఇప్పటికే 36మంది చనిపోయారు., మరో 250మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. హర్యానా., పంజాబ్‌లో జరుగుతున్న పరిణామాలపై న్యాయమూర్తులు ఆందోళణ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రధాని స్వయంగా రంగంలోకి దిగారు. కేంద్ర., రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరిపై హర్యానా హైకోర్టు శనివారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రధాని దేశం మొత్తానికి ప్రధాని అని., ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే సంగతి గుర్తుచుకోవాలని., దేశ సమగ్రత దెబ్బతీసే చర్యల్ని ఎలా ఉపేక్షిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అల్లర్లను అదుపు చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని వ్యాఖ్యానించిన నేపథ్యంలో హైకోర్టు కేంద్ర., రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడింది. బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌., శాంతి భద్రతలను ఇతరులు చేతుల్లోకి తీసుకుంటున్నా ఊపేక్షించడాన్ని తప్పు పట్టింది. ఓటు బ్యాంకు రాజకీయాలు దేశానికి మంచిది కాదని హెచ్చరించడంతో ప్రధాని ఆందోళనకారులకు నేరుగా హెచ్చరికలు చేశారు. సోమవారం తీర్పు నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నేరుగా హర్యానా., పంజాబ్‌ పరిస్థితుల్ని సమీక్షిస్తోంది.

Similar News