డేరాకు పదేళ్ల కఠిన జైలు శిక్ష

Update: 2017-08-28 10:37 GMT

సాద్వీలపై అత్యాచారానికి పాల్పడిన గుర్మీత్‌ రాం రహీమ్‌ సింగ్‌కు సిబిఐ ప్రత్యేక న్యాయ స్థానం పదేళ్ల కఠిన కారాగారాన్ని విధించింది. సోమవారం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే డేరా బాబా విలపిస్తూ కోర్టులో కుప్పకూలిపోయాడు. అంతకుముందు ఆయన చేసిన సామాజిక సేవను దృష్టిలో పెట్టుకుని శిక్షను తగ్గించాలని గుర్మీత్‌ తరపు న్యాయవాదులు చేసిన వాదనల్ని సిబిఐ న్యాయవాదులు తోసిపుచ్చారు. గుర్మీత్‌ పాల్పడిన హీనమైన నేరానికి జీవిత ఖైదు విధించాలని వాదించింది. తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని గుర్మీత్‌ న్యాయమూర్తిని పదేపదే వేడుకున్నారు. ఇరు పక్షాల వాదన విన్న న్యాయస్థానం డేరా బాబాకు పదేళ‌్ళ కఠిన కారాగారా వాసాన్ని శిక్షగా ఖరారు చేసింది. మరోవైపు కోర్టు తీర్పుపై హత్యకు గురైన జర్నలిస్ట్‌ రాంచంద్ర చత్రపతి కుమారుడు అన్షుల్‌ చత్రపతి హర్షం వ్యక్తం చేశారు. డేరా బాబా వ్యవహరాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన చత్రపతిని డేరా బాబా హత్య చేశారు. ఈ కేసు కూడా విచారణలో ఉంది. గుర్మీత్‌కు జీవిత ఖైదు విధించి ఉంటే బాగుండేదన్నారు.

మళ్లీ ఉద్రిక్తత.....

మరోవైపు డేరా బాబాకు శిక్షను ఖరారు చేయడంతో హర్యానాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పుల్కాలో బాబా అనుచరులు రెచ్చిపోయి వాహనాలకు నిప్పు పెట్టారు. తీర్పు వెలువడిన తర్వాత బిగ్గరగా రోదిస్తూ కూలబడిన గుర్మీత్‌ కోర్టు రూమ్‌ నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరించడంతో పోలీసులు ఆయన్ని బయటకు తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దాదాపు 15ఏళ్ల పాటు సాగిన విచారణ తర్వాత గుర్మీత్‌కు శిక్షలు ఖరారు కావడంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాయని బాధితుల కుటుంబీకులు వ్యాఖ్యానించారు. మరోవైపు గుర్మీత్‌ తక్కువ శిక్షతో బయటపడ్డారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. స్వయం ప్రకటిత దేవుడైన గుర్మీత్‌ను మరింత కఠినంగా శిక్షించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

Similar News