తమిళనాడు టు కర్ణాటక వయా ఏపీ

Update: 2017-01-25 00:57 GMT

చెన్నై మెరీనాబీచ్ ఆందోళన క్రమంగా అన్ని రాష్ట్రాలకూ చుట్టుకుంటోంది. మెరీనా బీచ్ లో విద్యార్థులు ఆందోళన నిర్వహించి జల్లికట్టుకు సమస్యకు పరిష్కారం కనుగొనడంతో ఇక అదే బాట పడుతున్నాయి మిగిలిన రాష్ట్రాలు. ఏపీలో ప్రత్యేక హోదా కోసం మెరీనా తరహా ఉద్యమానికి ఇప్పటికే విద్యార్థులు పిలుపు నిచ్చారు. తాజాగా ఇది పొరుగునే ఉన్న కర్ణాటకను కూడా అంటుకుంది. కర్ణాటకలో నిషేధానికి గురైన సంప్రదాయ క్రీడ కంబళకు అనుమతించాలన్న ఉద్యమం ఊపందుకోనుంది.

సిద్ధరామయ్య సారధ్యంలోనే....

కంబళపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే పిలుపు నిచ్చారు. జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని కన్నడిగుల సంప్రదాయ కళ అయిన కంబళను కూడా కాపాడుకుందామన్నారు సిద్ధరామయ్య. ఈ నెల 28 వతేదీన 250 జతల దున్నపోతులతో ర్యాలీని నిర్వహిస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. దీంతో కర్ణాటకలో కూడా జల్లికట్టు ఉద్యమం లాంటి పోరు షురూ కాబోతుంది.

కబళ క్రీడ అంటే....

కంబళ క్రీడ కర్ణాటకలో సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రీడలో జల్లికట్టు తరహా ఎద్దులను ఆపడం...హింసించడం వంటివి ఉండవు. కేవలం దున్నపోతుల మధ్య పోటీని నిర్వహిస్తారు. ఈ క్రీడలో జనానికి గాయాలయ్యే అవకాశాలు కూడా లేవు. అయితే జల్లికట్టు ఉద్యమాన్ని నిషేధించినప్పుడే గత ఏడాది కర్ణాటక హైకోర్టు పెటా వేసిన కేసుతో కంబళ క్రీడపై నిషేధం విధించింది. జల్లికట్టుకు ఇప్పుడు ఆర్డినెన్స్ జారీ చేయడంతో తమ సంప్రదాయ క్రీడను కూడా అనుమతించాలని కన్నడిగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 30 వతేదీన కంబళ క్రీడ నిషేధంపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరగనుంది. అదీగాక వచ్చే ఏడాది కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరుగుతుండటంతో సిద్ధ రామయ్య కావాలనే కంబళ అంశాన్ని తెరపైకి తెచ్చారంటున్నారు. సెంటిమెంట్ తో కొట్టి సిద్దూ రెండోసారి విజయం సాధించాలని భావిస్తున్నారని చెబుతున్నారు. అయితే కంబళపై నిషేధం ఎత్తివేయాలని జేడీఎస్ నేత కుమారస్వామి కూడా డిమాండ్ చేశారు. మొత్తం తమిళనాడు దెబ్బకు పక్కనే ఉన్న రెండు రాష్ట్రాలూ కర్ణాటక, ఏపీల్లో సెగ పుట్టింది.

Similar News