తిరుపతి టీడీపీలో ఎన్ని గ్రూపులో

Update: 2017-08-26 13:30 GMT

చిత్తూరు జిల్లా రాజకీయం ఊపందుకుంది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తెలియడంతో టీడీపీ, వైసీపీ శ్రేణులు సిద్దమయ్యాయి. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు హైకోర్టు సూచనల మేరకు జరుగుతుండటంతో ప్రభుత్వం తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరుపుతుందన్న ఊహాగానాలు బయలుదేరాయి. కాకినాడ కార్పొరేషన్ ఏర్పాటయిన తర్వాత ఇప్పటి వరకూ ఎన్నికలు జరగలేదు. పదేళ్ల నుంచి ఎన్నికలు జరగకపోవడంతో ముఖ్యంగా అధికార పార్టీ ద్వితీయ శ్రేణి కార్యకర్తలు డీలా పడిపోయి ఉన్నారు. తిరుపతి కార్పొరేషన్ లో మూడు పంచాయతీలను విలీనం చేయడంతో సమస్య తలెత్తింది. దీనికి అభ్యంతరం తెలియజేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో న్యాయపరమైన చిక్కులు రావడంతో ఇప్పటి వరకూ ఎన్నికలు జరగలేదు. తిరుపతి మేయర్ పదవిని దక్కించుకోవాలని టీడీపీ ముఖ్యనేతలందరూ ప్రయత్నిస్తున్నారు.

ఎన్నికల నగరా మోగక ముందే.....

తిరుపతి టీడీపీ ఈ ఎన్నికల్లో రెండు వర్గాలుగా విడిపోయాయి. ఎన్నికలు వస్తాయో? రావో? తెలియకున్నా గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా ఛైర్మన్ నరసింహయాదవ్ లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఎమ్మెల్యే సుగుణమ్మ బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో తమ వర్గానికే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు. అలాగే తుడా ఛైర్మన్ నరసింహయాదవ్ కూడా ప్రత్యేకంగా ఈ ఎన్నిక కోసం గ్రూపును తయారు చేసుకున్నారు. అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా ఒకటై ఇటీవల ఒక హోటల్ లో సమావేశమయ్యారు. తిరుపతిలో మిగిలిన వర్గాలకు న్యాయం జరిగిందని, తమకే పదవుల పంపకాల్లో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించు కున్నారు. మరోవైపు వైసీపీ కూడా రంగంలోకి దిగింది. భూమన కరుణాకర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రంగంలోకి పార్టీ ద్వితీయ శ్రేణి నేతలతో సమావేశమవుతున్నారు. మొత్తం మీద తిరుపతిలో పొలిటికల్ హీట్ బాగా పెరిగింది.

Similar News