తమిళనాడు రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయంపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పళనిస్వామికి 19 మంది ఎమ్మెల్యేలు లిఖిత పూర్వకంగా గవర్నర్ కు లేఖ ఇవ్వడంతో ఇప్పుడు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బలపరీక్ష నిర్వహించాలా? లేక ముఖ్యమంత్రిని మళ్లీ ఎన్నుకునే విధంగా చర్యలు చేపట్టాలా? అన్నది విద్యాసాగర్ రావు నిర్ణయించాల్సి ఉంది. అందుకోసం ఈరోజు విద్యాసాగర్ రావు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. పదిరోజుల్లో అసెంబ్లీని సమావేశ పరచి బలపరీక్షకు అనుమతిస్తేనే మంచిందంటున్నారు న్యాయనిపుణులు. లేకుంటే తిరుగుబాటు ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లే అవకాశముందని చెబుతున్నారు. తమిళనాడు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు విలీనం అయిన తర్వాత ప్రభుత్వానికి ఏ ఢోకా లేదనుకున్నారంతా. కాని దినకరన్ రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి గెంటి వేస్తారన్న భయంతోనే దినకరన్ దాదాపు 19 మంది ఎమ్మెల్యేలను పాండిచ్చేరిలోని ది విండ్ ఫ్లవర్ బీచ్ రిసార్ట్ లో ఉంచారు. తనకు వీరితో పాటు మరో 21 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని కూడా దినకరన్ చెబుతున్నారు. విండ్ ఫ్లవర్ రెస్టారెంట్ రోజుకు ఒక గది అద్దె దాదాపు ఇరవై వేల పైనే ఉంటుంది.
పాండిచ్చేరి ఎందుకు?
అయితే దినకరన్ పాండిచ్చేరిలోని రిసార్ట్స్ నే ఎందుకెంచుకున్నారంటే....అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎమ్మెల్యేలకు రక్షణ లభిస్తుంది. ఇటీవల గుజరాత్ ఎమ్మెల్యేలను కూడా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడింది. గతంలో చెన్నైకి సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలను ఉంచారు. అయితే ఇక్కడ ప్రభుత్వం రిసార్ట్స్ పై దాడి చేయించవచ్చన్న అనుమానంతో కాంగ్రెస్ సర్కార్ ఉన్న పాండిచ్చేరికి ఎమ్మెల్యేలను దినకరన్ తరలించారు. మరి ఎన్ని రోజులు క్యాంప్ లో ఉంచాలన్నది ఇంకా స్పష్టం కాకపోవడంతో అప్పుడే క్యాంప్ లో ఉన్న ఎమ్మెల్యేల్లో అలజడి కూడా మొదలయింది. రిసార్ట్స్ చుట్టూ పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. తమిళనాడు లోని రెండు వర్గాలు విలీనం కాకపోవడంతో పాండిచ్చేరిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలతో డీఎంకే నేతలు కూడా మాట్లాడి రిసార్ట్స్ వద్ద భద్రతను పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు అడిగింది అడిగినట్లుగా క్షణాల్లో తెచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇష్టమైన వంటకాలు వండి పెడుతున్నారు. వారి కోరింది వెంటనే సమకూరుతుండటంతో కొందరు ఎమ్మెల్యేలు ఎంజాయ్ కూడా చేస్తున్నారు. అయితే ఇది అత్యంత ఖరీదైన రిసార్ట్ కావడంతో ఈరోజో, రేపో మరో చోటకి శాసనసభ్యులను తరలించే అవకాశముంది. మొత్తం మీద తమిళ రాజకీయాలు ఏ మలుపులు తిరుగుతాయోనన్న టెన్షన్ సర్వత్రా నెలకొని ఉంది. శశికళ ఆదేశాల మేరకే దినకరన్ పళనిస్వామిపై కాలు దువ్వినట్లు తెలిసింది. పార్టీ నుంచి శశికళ కుటుంబాన్ని బయటకు పంపమని హామీ ఇస్తే దినకరన్ పునరాలోచించే అవకాశం లేకపోలేదంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు.