దినకరన్ బలం పెరుగుతోందా?

Update: 2017-08-27 17:30 GMT

తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ మారుతున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామిని పదవి నుంచి దించేందుకు దినకరన్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. రోజురోజుకూ దినకరన్ వర్గం బలం పెరుగుతుండటంతో పళని, పన్నీర్ సెల్వం వర్గాల్లో ఆందోళన పెరుగుతోంది. నిన్నటి వరకూ దినకరన్ వర్గంలో 19 మంది ఎమ్మెల్యేలుండగా మరో మగ్గురు ఎమ్మెల్యేలు వచ్చి చేరారు. దినకరన్ వర్గంలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని చేస్తున్న హెచ్చరికలు కూడా పనిచేయడం లేదు. దీంతో దినకరన్ తన క్యాంప్ ను పాండిచ్చేరి నుంచి కర్ణాటకకు మార్చినట్లు తెలుస్తోంది. అయితే గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయం కోసమే దినకరన్ బ్యాచ్ ఎదురు చూస్తోంది.

పళనిలోనూ తగ్గని ధీమా.....

మరోవైపు పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు ఎమ్మెల్యేలతో సమావేశమై వారికి భరోసా కల్పించారు. ఎట్టిపరిస్థితుల్లో దినకరన్ వత్తిడికి తలొగ్గేది లేదని పళనిస్వామి చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెలలో శశికళ కుటుంబాన్ని బయటకు పంపేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. కేంద్రం అండ ఉండటంతో పళని, పన్నీర్ వర్గాలు ధీమాగానే ఉన్నాయి. అయితే దినకరన్ మాత్రం తాను సీఎం అవ్వాలనుకుంటే ఎప్పుడో అయ్యేవాడినని, అయితే తాను తిరస్కరించినందునే పళనిస్వామికి ఛాన్స్ దక్కిందని దినకరన్ చెబుతున్నారు. ఈపీఎస్, ఓపీఎస్ లు ఒక్కటై చిన్నమ్మ కుటుంబాన్ని బయటకు పంపితే ఊరుకునేది లేదని ఆయన ఆదివారం హెచ్చరించారు. మరోవైపు డీఎంకే నేత స్టాలిన్ బలపరీక్షకు ఆదేశించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

Similar News