దీక్షతో పొన్నంకు పూర్తిగా తెలిసిపోయిందా?

Update: 2017-08-24 11:30 GMT

వ్రతం చెడ్డా ఫలితం దక్కిందని సంబరపడిపోతున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు దీక్షల కాలం మొదలయినట్లుంది. ఇటీవల మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ఆమరణ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ దీక్ష మూడు రోజులు మాత్రమే జరిగింది. నాలుగో రోజు పోలీసులు పొన్నంను ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలోనూ దీక్ష చేస్తానన్న పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ పెద్దలు నచ్చ జెప్పి దీక్షను విరమింప చేశారు. అయితే లోకల్ సమస్యతో దీక్ష చేపట్టిన పొన్నం ప్రభాకర్ కు అన్ని విషయాలు తెలిసి వచ్చాయట. ఎవరు తనవారో...ఎవరు కాదో? ఈ దీక్ష ద్వారానే తెలిసిపోయిందట. ప్రజలు కూడా పొన్నం దీక్షకు బాగానే స్పందించారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు దీక్ష వద్దకు వచ్చి పొన్నం ప్రభాకర్ కు మద్దతు తెలిపారు.

ఎవరు తమవారు? ఎవరు పరాయి వారు?

అయితే సొంత పార్టీ నేతలే కొందరు ముఖం చాటేసిన వైనం ఈ దీక్ష ద్వారా తెలిసిపోయిందంటున్నారు పొన్నం ముఖ్య అనుచరులు. కొందరు అసలు దీక్షకు రాకపోగా, మరికొందరు ఏదో వచ్చామన్నట్లు వెళ్లిపోయారని పొన్నం గమనించారట. దీంతో పొన్నం ప్రభాకర్ కు ప్రత్యర్థులకన్నా సొంతవారితోనే ప్రమాదమని గుర్తించిన ప్రభాకర్ అందుకు అనుగుణంగా తన స్టయిల్ ను కూడా మార్చుకోనున్నారట. మెడికల్ కళాశాల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లేకుండా దీక్ష విరమించినప్పటికీ పొన్నం కరీంనగర్ లో ఫోకస్ అయ్యారంటున్నారు. దీంతో ఇటీవల సంగారెడ్డిలోనూ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని తూర్పు జయప్రకాశ్ రెడ్డి దీక్షకు దిగారు. అయితే ఆయన దీక్షకు దిగకుండానే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక నేరెళ్ల విషయంలో ప్రభుత్వం దళితులకు న్యాయం చేయకుంటే దీక్షకు దిగుతానని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఇప్పటికే ప్రకటించారు. మొత్తం మీద ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకున్నా... దీక్షల ద్వారా తమ వారెవరో? పరాయి వారెవరో తెలిసిపోతుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. అదండీ సంగతి.

Similar News