నంద్యాల ఉప ఎన్నిక వీరి చావుకొచ్చింది

Update: 2017-08-24 00:30 GMT

నంద్యాల ఉప ఎన్నిక వీరికి కష్టాలు తెచ్చిపెట్టింది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తమకు నష్టపరిహారం ఇవ్వడంలో అన్యాయం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. వంశధార పనులను అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులతో ప్రభుత్వం వంశధార ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. వచ్చే ఏడాదిలోగా ఈ పనులు పూర్తి కావాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అందుకోసమే నిర్వాసితులను పట్టించుకోకుండా పోలీసు పహారా మధ్య పనులను ప్రారంభించింది. అయితే ఎక్కడికక్కడ వంశధార నిర్వాసితులు అడ్డుకుంటుండటంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. లాఠీ ఛార్జీలు చేశారు. రక్తం చిందింది. బాధితులకు గాయాలపాలై ఆస్పత్రిలో ఉండగా, మరికొందరు పోలీసు కేసులతో జైళ్లలో మగ్గిపోతున్నారు.

అధికార, ప్రతిపక్షాలూ అడ్రస్ లేవు.....

అయితే వంశధార నిర్వాసితుల కోసమే తాను పార్టీ మారానని చెబుతున్న ఆ ప్రాంత ఎమ్మెల్యే వెంకటరమణ నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నిక రావడం వీరికి శాపంగా మారింది. తమగోడు చెప్పుకోవడానికి అధికార పక్షమూ లేదు. ప్రతిపక్షమూ లేదు. అందరూ నంద్యాలలోనే మకాం వేసి ఉండటంతో వంశధార నిర్వాసితుల గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అధికార పక్షం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా తమకు అండగా నిలబడతారనుకున్న ప్రతిపక్ష వైసీపీ నేతలు ధర్మాన ప్రసాదరావు లాంటి నేతలు కూడా అక్కడ లేకపోవడంతో వాళ్లు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఒక్క సిపీఎం నేతలు మాత్రమే వారి గోడు వింటున్నారు. కాని వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తుండటంతో వంశధార నిర్వాసితులను ఎవరూ పట్టించుకోవడం లేదు. నంద్యాల ఉప ఎన్నిక వీరికి కష్టాలు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. మంత్రి అచ్చెన్నాయుడు కూడా తమ బాధను విన్పించుకోవడం లేదని నిర్వాసితులు బోరుమంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వంశధార నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Similar News