దేశంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ పెద్ద ఎత్తున ఒంటి కాలిపై లేచాయి విపక్షాలు . మోడీ , అమిత్ షా వ్యూహాలతో పలు రాష్ట్రాల్లో పరాజయాన్ని మూట కట్టుకున్న విపక్షాలు ఎన్నికల కమిషన్ పై కారాలు మిరియాలు నూరిన సంగతి తెలిసిందే . ఈవీఎం విధానం మార్చి పాత తీరులోనే బ్యాలెట్ పత్రం ముద్రించాలని డిమాండ్ కూడా చేశాయి . దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చే నడిచింది . ఈవీఎం ట్యాంపరింగ్ సాధ్యం కాదని ఎన్నికల కమిషన్ పలు సార్లు ప్రదర్శనలు సైతం చేసి తన శీలాన్ని నిరూపించుకోవాలిసిన అగత్యం ఏర్పడింది . దీంతో భవిష్యత్తులో కూడా ఈ అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉందని గుర్తించి దానికి విరుగుడు కనిపెట్టింది ఎన్నికల సంఘం . ఓటు ఎవరికి వేశారో ఏ సింబల్ నొక్కారో చూసుకునే సౌకర్యాన్ని నంద్యాల ఉపఎన్నికల్లో తొలిసారి అక్కడి ఓటర్లు వినియోగిస్తారు .
ఓటర్లకు అవగాహన కల్పించిన అధికారులు ...
సరికొత్త ఎన్నికల విధానం నంద్యాల్లో అమలు చేసే ముందు ఎన్నికల అధికారులు విస్తృతంగా దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించారు . ఓటు వేసిన వెంటనే పక్కనే వున్న డిస్ ప్లే పరికరంలో 7 సెకన్లు పాటు మనం నొక్కిన గుర్తు కనిపించేలా ఈ విధానం అమలు చేస్తారు . దీంతో తాము వేసిన ఓటు వేరే గుర్తుకు పోయిందనే సందేహం ఓటరుకు దూరం అవుతుంది . ఈ నేపథ్యంలో గతం లో జరిగినట్లు అనేక వివాదాలు ఇప్పుడు జరిగే అవకాశాలు తక్కువ . తాము ఒక గుర్తుకు ఓటు వేస్తే మరో పార్టీ సింబల్ కి పోయిందని జరిగే గొడవలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ లు ఎక్కువనే చెప్పాలి