నంద్యాల ఉపఎన్నికపై జగన్ ధీమా ఏంటంటే?

Update: 2017-08-25 00:30 GMT

నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ ధీమాగానే ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ ఓట్లు పోలవ్వడంతో శిల్పా మోహన్ రెడ్డి తన విజయం ఖాయమంటున్నారు. ఉపఎన్నికలో పోలింగ్ సరళిని లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్ సమీక్షించారు. పోలింగ్ వివరాలను తెప్పించుకుని మరీ సీనియర్ నేతలతో చర్చించారు. ముఖ్యంగా గోస్పాడు మండలంలో అత్యధికంగా ఓట్లు పోలవ్వడంతో వైసీపీ నేతలు ఆశలు రెట్టింపయ్యాయి. నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లోని గ్రామాల్లో పోలింగ్ ను తగ్గించాలని టీడీపీ విశ్వప్రయత్నం చేసిందని, కాని ప్రజలు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో పోలింగ్ కు తరలి వచ్చారని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పల్లెటూళ్లలో ఇంత చైతన్యం ఎక్కడా చూడలేదని వైసీపీ అధినేత జగన్ సయితం ఆశ్చర్యం వ్యక్తం చేశారట. తాము ఊహించిన దానికన్నా ఎక్కువ ఓట్లు పోలయ్యాయని, ఖచ్చితంగా తమకు విజయం ఖాయమని సీనియర్ నేతలు కూడా చెప్పారు. అయితే కౌంటింగ్ వద్ద కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలని, పోలింగ్ లాగానే కౌంటింగ్ లో కూడా మంచి కార్యకర్తలను నియమించాలని జగన్ ఆదేశించారు.

గోస్పాడు....బయటపడేస్తుంది......

పల్లెల్లో అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. నంద్యాల రూరల్ పరిధిలో 20 గ్రామ పంచాయతీల్లో 57 పోలింగ్ కేంద్రాల పరిధిలో 47,386 మంది ఓటర్లుంటే, 41,514 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 87.61 శాతం పోలింగ్ నమోదయింది. ఇక గోస్పాడు మండలంలోని 15 గ్రామాల పరిధిలో 39 పోలింగ్ కేంద్రాలుంటే వాటిలో 28,844 మంది ఓటర్లున్నారు. వీరిలో 26,192 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే గోస్పాడు మండలంలో 90.81 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నమాట. అంటే వైసీపీకి పట్టుందని భావిస్తున్న గోస్పాడు మండలంలోనే 90 శాతానికి పైగా పోలింగ్ కావడంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. నంద్యాల పట్టణంలో మాత్రం 74 శాతం మాత్రమే పోలవ్వడం కూడా తమకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. మొత్తం మీద జగన్ పార్టీ నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమాతోనే ఉంది.

Similar News