నంద్యాల ఫలితంతో కాకినాడ గెలుపు ముడిపడి ఉందా?

Update: 2017-08-26 10:30 GMT

నంద్యాల ఫలితంతో కాకినాడ ఫలితానికి ముడిపడి ఉందా? నంద్యాలలో ఏ పార్టీ గెలిస్తే కాకినాడ కార్పొరేషన్ లోనే అదే పార్టీ జెండా ఎగుర వేయనుందా? అవుననే అంటున్నారు. ఈ నెల 28వ తేదీ నంద్యాల కౌంటింగ్ జరుగుతుంది. మధ్యాహ్నానికి ఫలితాలపై క్లారిటీ వస్తుంది. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య పోటా పోటీ నెలకొని ఉండటం అందరికీ తెలిసిందే. ఏ అభ్యర్థి గెలిచినా స్వల్ప మెజారిటీతో బయటపడతారని సర్వేలు కూడా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నిక ఫలితాల కోసం టెన్షన్ తో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్ 28వ తేదీన జరిగితే... కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ఆ మరుసటి రోజు 29వ తేదీన జరగనుంది. అంటే నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం కాకినాడ కార్పొరేషన్ పోలింగ్ పై పడుతుందన్న ఆందోళన టీడీపీ, వైసీపీల్లోనూ వ్యక్త మవుతోంది.

రెండు పార్టీల్లోనూ ఆందోళన.......

కాకినాడ కార్పొరేషన్ లో మొత్తం 48 డివిజన్లుండగా, వైసీపీ 48 డివిజన్లకు తమ అభ్యర్థులను నిలిపింది. టీడీపీ 39 వార్డులు తీసుకుని, 9 వార్డులు తన మిత్రపక్షమైన బీజేపీకి కేటాయించింది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ వైసీపీ, టీడీపీ గట్టిగా పోటీ పడుతున్నాయి. వార్డు ఎన్నికలు కావడంతో టీడీపీ పది మంది మంత్రులను 40 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను రంగంలోకి దించింది. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధ్యక్షుడు జగన్ కాకినాడలో రెండు రోజుల పాటు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నిక ఫలితం ఏ పార్టీకి అనుకూలంగా వస్తే అదే పార్టీకి కాకినాడలో కూడా జనం ఓట్లేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్కడ స్వల్ప మెజారిటీతో ఏ పార్టీ బయటపడినా కాకినాడలో అందుకు విరుద్ధమైన ఫలితం కూడావచ్చే అవకాశం లేకపోలేదు. దీంతో రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ కాకినాడ నేతల్లో టెన్షన్ పట్టుకుంది.

Similar News