నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఖాయమని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. తనకున్న సమచారం, ఇతరుల నుంచి వచ్చిన నివేదికల ప్రకారం నంద్యాలలో భారీ మెజారిటీతో గెలుపు సాధిస్తామని చంద్రబాబు తెలిపారు. నంద్యాల ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారన్నారు. చంద్రబాబు కొద్దిసేపటి క్రితం కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి మంత్రులు, బూత్ కమిటీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రచారం ముమ్మరం చేయండి.....
నంద్యాలలో మంచి ఫలితాలను సాధించబోతున్నామని ఆయన పార్టీ శ్రేణులను ఉత్సాహ పరిచారు. నంద్యాల ఉప ఎన్నిక ముగిసన తర్వాత తొలిసారి చంద్రబాబు నంద్యాల ఫలితాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాకినాడ ఎన్నికల్లోనూ నంద్యాలలో మాదిరిగానే కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థుల గెలుపుకు కూడా కృషి చేయాలన్నారు. ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసి తెలుగుదేశం ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.