నంద్యాలలో పోలింగ్ ముగిసినా ఉద్రిక్త పరిస్థితులు మాత్రం తగ్గలేదు. రెండు ప్రధాన పక్షాలైన టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పోలింగ్ ముగియడం... పెద్దయెత్తున పోలింగ్ జరగడంతో రెండు పార్టీల క్యాడర్ లో గెలుపు ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అందుకోసమే రెండు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఎక్కడ తారసపడినా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్ పూర్తయిన సమయంలో ప్రారంభమైన గొడవలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ అధినేత అభిరుచి మధు, శిల్పా చక్రపాణిరెడ్డిల మధ్య ఘర్షణ మరచిపోక ముందే మరిన్ని సంఘటనలు నంద్యాల రూరల్ లోనూ, గోస్పాడు మండలంలోనూ చోటు చేసుకుంటుండం పోలీసులకు ఆందోళనకు గురి చేస్తోంది.
కొనసాగుతున్న వైసీపీ, టీడీపీ ఫిర్యాదులు.....
నంద్యాల నియోజకవర్గంలోని నూనెపల్లిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. తమపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి అతని అనుచరులు దాడి చేశారని బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి ప్రతిగా టీడీపీ కార్యకర్తలు కూడా వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై కాకుండా బాధితులపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆందోళనకు దిగుతున్నారు. దీంతో నంద్యాలలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉప ఎన్నిక కోసం వచ్చిన కేంద్ర బలగాలు ఇంకా నంద్యాలలోనే ఉన్నాయి. కౌంటింగ్ ముగిసేంత వరకూ నంద్యాలలోనే ఉంటున్నప్పటికీ ఎక్కడో అక్కడ ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉండటం పోలీసు ఉన్నతాధికారులను కలవర పరుస్తోంది. ఎన్నికానంతరం జరిగే ఘర్షణలు ఎక్కువగా చోటు చేసుకుంటుండటంతో పార్టీ నేతల్లోనూ టెన్షన్ నెలకొని ఉంది. అయితే నంద్యాలలో ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉంది.