నంద్యాలలో ఇద్దరికీ సానుభూతి పనిచేస్తుందా?

Update: 2017-08-28 00:30 GMT

నంద్యాలలో సానుభూతికి ఓటర్లు పట్టం కడతారా? లేక ప్రభుత్వ వ్యతిరేకతపై నినదిస్తారా? మరికాసేపట్లో తేలబోతోంది. భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించారు. ఆయన మరణించిన నేపథ్యంలోనే ఉప ఎన్నికలు జరుగుతుండటంతో ఆయన అన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు అవకాశమిచ్చారు. సానుభూతి పనిచేస్తుందని టీడీపీ గట్టిగా విశ్వసిస్తోంది. నంద్యాల ఎన్నికల్లో 79 శాతం పోలింగ్ జరగడంతో సింపతీతోనే ఎక్కువ మంది మహిళలు భూమాకే ఓటువేస్తారన్న ధీమాలో టీడీపీ నేతలు ఉన్నారు. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ సింపతీ ఫ్యాక్టర్ బాగా పనిచేసింది. ఒక వ్యక్తి మరణంతో జరిగిన ఎన్నిక కావడంతో ఆయన కుటుంబ సభ్యుల వైపే జనం మొగ్గు చూపుతారని గత ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తుండటంతో టీడీపీ తమదే గెలుపు ఖాయమంటోంది.

శిల్పా విషంయలో సింపతీ........

అయితే వైసీపీకి కూడా సింపతీ ఉంది. శిల్పా మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఓటమిని చవి చూశారు. స్వల్ప మెజారిటీతో అప్పటి వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డిపై పరాజయం పాలయ్యారు. సో... గత ఎన్నికల్లో ఓటమి పాలయిన శిల్పా మోహన్ రెడ్డి పట్ల కూడా ప్రజలు సానుభూతి చూపించే అవకాశముందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడం, తాము గెలిపించిన నేత పార్టీని మారడంపై కూడా ప్రజలు స్పందించే అవకాశముందంటున్నారు. అలాగే ఎక్కువ శాతం పోల్ కావడంతో ప్రభుత్వ వ్యతిరేకతపై ప్రజలు తమ తీర్పును చెబుతారని వైసీపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద రెండు పార్టీల అభ్యర్థులకూ సింపతీ ఉందని, మరి ఎవరు గెలుస్తారో అన్నది వేచి చూడాల్సి ఉందని నంద్యాలలో సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Similar News