నంద్యాల నియోజకవర్గంలో ఓటర్ల నాడి తొలి నుంచి కాంగ్రెస్ కు అనుకూలంగానే ఉంది. 1955 నుంచి ఇప్పటి వరకూ 14 సార్లు నంద్యాల నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే అందులో కాంగ్రెస్ పార్టీ ఐదు సార్లు, టీడీపీ మూడు సార్లు, వైసీపీ ఒకసారి, జనతా పార్టీ ఒకసారి, స్వతంత్రులు నాలుగు సార్లు గెలుపొందారు. నంద్యాల నియోజకవర్గం 1955లో ఏర్పడింది. తొలిసారే స్వతంత్ర అభ్యర్థి గోపవరం రామిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు సుబ్బారెడ్డిపై దాదాపు 12 వేల ఓట్ల మెజారితో గెలుపొందారు. 1959, 1967, 1989, 2004, 2009 ఎన్నికల్లో నంద్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. ఇక తెలుగుదేశం పార్టీ 1985, 1994, 1999 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో విజయబావుటా ఎగురవేసింది. వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత 2014 ఎన్నికల్లో తొలిసారి ఇక్కడ తన జెండాను పాతింది. అయితే ఎక్కువ సార్లు ఇక్కడ స్వతంత్రులు, కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే గెలిచినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంటే ఏ పార్టీకి నంద్యాల నియోజకవర్గం కొమ్ముకాయలేదు. ఇక్కడ వ్యక్తుల ఆధారంగానే ఎన్నికల జరుగుతాయని గత చరిత్ర చెబుతోంది.
నంద్యాలలో ఇది రెండోసారి.....
1959లో నంద్యాలకు ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జీవి రెడ్డి స్వతంత్ర అభ్యర్థి పీఎం రెడ్డిపై కేవలం రెండున్నర వేల ఓట్లు తేడాతోనే గెలుపొందారు. అయితే ఈ ఉప ఎన్నికలో కూడా అప్పుడు నువ్వా? నేనా? అన్నట్లు జరిగిందని చెబుతున్నారు. ఉప ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతోనే అభ్యర్థులు బయటపడినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 1959లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జీవీ రెడ్డికి 12,819 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి పీఎం రెడ్డికి 9,227 ఓట్లు వచ్చాయి. వీరిద్దరి గెలుపు ఓటముల మధ్య తేడా కేవలం 3,602 ఓట్లు మాత్రమే. 2014 ఎన్నికల్లో కూడా కీ ఫైట్ జరిగిందంటున్నారు. టగ్ ఆఫ్ వార్ జరిగిన ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డికి 82,194 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి 78,590 ఓట్లు వచ్చాయి. అంటే టఫ్ ఫైట్ ఉన్న ప్రతిసారీ మెజారిటీ మూడు వేలకు మించి రాకపోవడం విశేషం. మిగిలిన ఎన్నికల్లో ముప్ఫయి వేల పైచిలుకు మెజారిటీని గెలిచిన అభ్యర్థి సాధించారు. గత ఎన్నికలను బట్టి చూసినా నంద్యాలలో ప్రస్తుతం జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో మెజారిటీ అన్నది స్వల్పంగానే ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా.