నంద్యాలలో జగన్ ను ఓడించడానికి సోనియా వ్యూహమిదేనా?

Update: 2017-08-25 03:30 GMT

నంద్యాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం వర్క్ అవుట్ అయిందా? ఢిల్లీ శాసనాన్ని పీసీసీ సమర్ధవంతంగా అమలు చేసిందా? ఇదే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. నంద్యాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటి చేయడాన్ని సాదా సీదాగా తీసుకున్నారు. ఉప ఎన్నికల్లో తమ ఉనికి కోసమే బరిలోకి దిగిందని అందరూ భావించారు. అయితే దీని వెనక టెన్ జన్ పథ్ వ్యూహం ఉందని తెలిసి ఇప్పుడు పొలిటికల్ క్యారిడార్ లో అందరూ ఆశ్చర్యపోతున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో తాము పోటీ చేస్తామని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తొలి నుంచి చెబుతున్నారు. అయితే అభ్యర్థి ఎవరన్నదీ ఇంకా తాము తేల్చలేదని, హైకమాండ్ అనుమతితో ఖరారు చేస్తామని చెప్పారు. ముగ్గురితో అభ్యర్థుల ఎంపికకు కమిటీని కూడా వేశారు. వీరంతా కలిసి మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సతీమణి సుజాతమ్మ పేరును సూచించారు. రెడ్డి సామాజిక వర్గం కావడంతో కొంత ఎక్కువ ఓట్లను తెచ్చుకుని ఉనికిని కాపాడుకోవచ్చన్నది పీసీసీ వ్యూహం.

పీసీసీ నిర్ణయించిన అభ్యర్థిని కాదని.....

అయితే కోట్ల సుజాతమ్మ కూడా పోటీకి కొంత సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఢిల్లీ స్థాయిలో పెద్దలు సుజాతమ్మ అభ్యర్థిత్వాన్ని అంగీకరించలేదు. అక్కడ జగన్ ను దెబ్బ కొట్టాలంటే ముస్లిం అభ్యర్థినే బరిలోకి దింపాలని టెన్ జన్ పథ్ నుంచి ఆదేశాలందాయి. ఓటమి ఎలా తప్పదని తెలసినప్పటికీ, జగన్ ఓట్లు చీల్చాలంటే ముస్లిం అభ్యర్థినే వెతకాలని హస్తిన పెద్దలు పీసీసీని ఆదేశించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 2500 ఓట్లు వచ్చాయి. ముస్లింలు కొంత వైసీపీకి అనుకూలంగా ఉన్నారని తెలియడంతో జగన్ పై కోపంగా ఉన్న సోనియా టీమ్ ఈ నిర్ణయం తీసుకుందని, అందుకోసమే అప్పటికప్పుడు హైకోర్టులో న్యాయవాది వృత్తి చేసుకుంటున్న అబ్దుల్ ఖాదర్ ను రంగంలోకి దించారని కాంగ్రెస్ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. మొత్తం మీద సోనియాకు జగన్ పై ఇంకా కసి తీరలేదన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లోనే బలంగా విన్పిస్తోంది.

Similar News