నంద్యాలలో నేనే జెండా ఎగురవేస్తానన్న శిల్పా

Update: 2017-08-23 13:47 GMT

ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయడానికి టీడీపీ నేతలు ప్రయత్నం చేసినప్పటికీ ఎన్నిక ప్రశాంతంగా జరగడానికి కృషి చేసిన నంద్యాల ప్రజలకు వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజెప్పారు. శిల్పా పోలింగ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. పెద్దయెత్తున యువత, మహిళలు, వృద్ధులు, రైతులు ఓటింగ్ లో పాల్గొనడం చూస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఏంటో అర్ధమవుతుందన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు ఎలాంటి కుట్ర చేసినా వైసీపీ కార్యకర్తలు, నేతలు వాటిని భగ్నం చేసుకుంటూ ముందుకు వెళ్లారన్నారు. నిన్న రాత్రి నుంచే అధికార పార్టీ దాడులకు దిగిందన్నారు. తన సోదరుడు చక్రపాణిరెడ్డి ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించారన్నారు. చక్రపాణిరెడ్డిని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జనార్థన్ రెడ్డి, అఖిలప్రియ, టీజీ వెంకటేశ్, రామకృష్ణారెడ్డి ఎన్నికలో ఇబ్బంది కలగడానికి ప్రయత్నించారన్నారు. ఎన్నికను వాయిదా వేయడానికే వారు చాలా ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. భూమా నాగిరెడ్డి కూతురు మౌనిక తన ఏజెంట్ ను బయటకు పంపాలని ప్రయత్నించిందన్నారు. ఏవీ సుబ్బారెడ్డి తమ వర్గానికి చెందిన కౌన్సిలర్ పై దాడికి దిగారాన్నారు. బ్రహ్మానందరెడ్డి చిన్మయ స్కూల్ దగ్గర తమ ఏజెంట్ ను బెదిరించారని చెప్పారు. స్థానిక పోలీసులు పక్షపాతం ప్రదర్శించారన్నారు. ఎన్నికల కమిషన్, సీఆర్పీఎఫ్ పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేశారన్నారు. తన తమ్ముడు నైతిక విలువలకు కట్టుబడి ఆరేళ్లు పదవీకాలం ఉన్నా ఎమ్మెల్సీ పదవిని వదిలేశారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారినా మంత్రులుగా కొనసాగుతూనే ఉన్నారన్నారు. నైతిక విలువలు జగన్ నుంచి చంద్రబాబు నేర్చుకోవాలన్నారు. నూటికి నూరుపాళ్లు వైసీపీ గెలుస్తుందని శిల్పా ధీమా వ్యక్తం చేశారు.

Similar News