తమిళనాడులో ఎంబిబిఎస్., బిడిఎస్ ప్రవేశాలకు జాతీయ స్థాయి నీట్ తప్పనిసరి అని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష మేరకు ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఆగష్టు 24 నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని., సెప్టెంబర్ 4కల్లా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు వివాదాల నేపథ్యంలో తమిళనాడులో అడ్మిషన్ల ప్రక్రియ జాప్యం కావడంపై ఆగష్టు 16న తమిళ విద్యార్ధులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గత ఏడాది నుంచి దేశంలో ఎంబిబిఎస్., బిడిఎస్ ప్రవేశాలకు జాతీయ స్థాయి అర్హత పరీక్ష(నీట్)ను తప్పనిసరి చేశారు.
అనేక అభ్యంతరాలు......
దీనిపై మద్రాసు., గుజరాత్ హైకోర్టులలో వేర్వేరుగా పిటిషన్లు దాఖలయ్యాయి. నీట్ 2017 ప్రవేశపరీక్ష ప్రశ్నాపత్రం ఇంగ్లీష్., హిందీ ప్రశ్నాపత్రాలకంటే కఠినంగా ఉందంటూ గుజరాత్., తమిళనాడుల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదం నేపథ్యంలో మద్రాసు హైకోర్టు మే 24న స్టే విధించింది. విద్యార్ధుల్లో ఆందోళన నెలకొని ఉండటం., అడ్మిషన్ల గడువు దాటి పోతుండటంతో మద్రాసు హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ ఏడాది దాదాపు 12 లక్షల మంది నీట్ పరీక్షకు హాజరయ్యారు. ఇంగ్లీష్., హిందీలతో పాటు మొత్తం పది భాషల్లో ప్రవేశపరీక్షను నిర్వహించారు.