నెల్లూరులో టీడీపీ, వైసీపీ టెస్ట్ మ్యాచ్? వన్డేనా?

Update: 2017-08-24 01:30 GMT

రాష్ట్రంలోనే సంచలనం సృష్టిస్తున్న క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుందా? అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష వైసీపీని ఈ విషయంలో ఇరకాటంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం జోరుగా సాగుతోంది. దీనిపై కన్నేసిన పోలీసులు కూపీలాగారు. నెల్లూరు కేంద్రంగా జరుగుతున్న ఈ ర్యాకెట్ ను ఛేదించారు. నెల్లూరు క్రికెట్ బెట్టింగ్ కేసులో దాదాపు ఇప్పటికే 200 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ బెట్టింగ్ వెనక ప్రజాప్రతినిధులు ఉన్నారని గత కొంతకాలంగా ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లను విచారించారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ విచారణలో వైసీపీ ఎమ్మెల్యేలు తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందించారు. క్రికెట్ బెట్టింగ్ లో ప్రధాన నిందితుడైన కృష్ణ సింగ్ తో ఫోన్ లు ఎన్నిసార్లు మాట్లాడారో వివరించారు. కృష్ణ సింగ్ తో సంబంధాలపై వైసీపీ ఎమ్మెల్యేలను విచారించారు.

వైసీపీ ఎమ్మెల్యేలే టార్గెట్టా?

అయితే విచారణకు హాజరైన ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం తమను ప్రభుత్వం టార్గెట్ చేసిందంటున్నారు. రాష్ట్రంలో వైసీపీకి బలమైన జిల్లా నెల్లూరు కావడంతో తమనే పోలీసుల సహకారంతో అధికార పార్టీ లక్ష్యంగా చేసుకుందని వారు ఆరోపిస్తున్నారు. తాము ఎమ్మెల్యేలమని, ఎంతోమంది ఫోన్లు చేస్తుంటారని, ఫోన్ నెంబర్లు ఉన్నంత మాత్రాన తమను నిందితులుగా భావిస్తూ విచారణకు పిలవడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమకు ఈ క్రికెట్ బెట్టింగ్ తో ఎలాంటి సంబంధం లేదని ఇద్దరు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. క్రికెట్ బెట్టింగ్ లో ఉన్నదంతా అధికార పార్టీకి చెందిన నేతలు, మంత్రుల అనుచరులన్న సంగతి అందరికీ తెలుసునని, వారిని అరెస్ట్ చేయకుండా పోలీసుల అమాయకుల మీద కేసులు నమోదు చేస్తున్నారన్నారు. నెల్లూరు నుంచి క్రికెట్ బెట్టింగ్ ను తరిమికొట్టడానికి తాము సహకరిస్తామని వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. మంత్రి సూచనల మేరకే పోలీసులు నడుచుకుంటున్నట్లు తమకు అర్ధమవుతోందన్నారు. అయితే మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం సింహపురిలో రాజకీయరంగు పులుముకుంది. పోలీసులు మాత్రం తాము నిష్పక్షపాతంగానే విచారణ జరుపుతున్నామని చెబుతున్నారు.

Similar News