పనిచేసే షాపులోనే వీరు ఏం చేశారంటే?

Update: 2018-03-23 02:47 GMT

పనిచేసే షాపులో లక్షల రూపాయల డబ్బును కౌంటర్లో చూసేవారు ఆ సేల్స్ మెన్లు.. ఆ డబ్బు కాజేద్దామనే దుర్బుధ్ది పుట్టింది వారికి. 11 లక్షలతో ఉడాయించిన ఇద్దరు దొంగలు పోలీసుల చేతికి చిక్కారు. హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లో ప్రిన్స్ పేపర్ ట్రేడర్ షాపులో గతంలో పనిచేసిన జగదీష్ గిరి, ప్రవీణ్ సింగ్. గుజరాత్ రాష్ట్రానికి చెందిన వీరిద్దరూ నమ్మకంతో షాపులో పనిచేసేవారు. షాపులో రోజూ లక్షలాది రూపాయలు కౌంటర్లో పెడ్తుండటాన్ని గమనించేవారు సేల్స్ మెన్లు. ఆ డబ్బు కాజేయడానికి ఓ పథకం వేశారు. ఈనెల 13వ తేదీన రాత్రి షాపు మూసేసే సమయంలో జగదీష్ గిరి, ప్రవీణ్ సింగ్ రహస్యంగా షాపు మూడో అంతస్తులోని టెర్రస్ పైకి వెళ్లారు. రాత్రి ఒంటి గంట సమయంలో టెర్రస్ నుంచి వచ్చి.. అక్కడి స్టోర్ రూమ్ తాళాలు పగులగొట్టిన దొంగలు మూడో అంతస్తు నుంచి తాడు సాయంతో షాపులోకి దిగారు. కౌంటర్లో ఉన్న 11 లక్షల రూపాయలు కాజేసి షాపు పక్కనున్న ఇళ్లపై నుంచి కిందకు దిగి ఉడాయించారు. కాజేసిన డబ్బు తీసుకుని మర్నాడు రాత్రి ట్రావెల్స్ బస్సెక్కి గుజరాత్ లోని తమ ఊరెళ్తుండగా.. సమాచారం అందుకున్న ఇక్కడి పోలీసులు.. అహ్మదాబాద్ సమీపంలోని రామోల్ పోలీసుల్ని అప్రమత్తం చేశారు. అక్కడి పోలీసులు వెంటనే బస్సును ఆపి.. గాఢ నిద్రలో ఉన్న దొంగల్ని పట్టుకుని.. ఆ సొత్తును రికవరీ చేశారు. అక్కడి నుంచి దొంగలిద్దర్నీ హైదరాబాద్ కు తీసుకొచ్చారు పోలీసులు.

Similar News