జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. ఒకవైపు సినిమా షూటింగ్ లో బిజీగానే ఉంటూ మరోవైపు పాలిటిక్స్ పై ఒక కన్నేసే ఉంచారు. ఇందుకు జనసేనను చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ప్రధానంగా జనంలో ఉన్న సమస్యలను గుర్తించాలని పవన్ పార్టీ కార్యకర్తలకు సమాచారం ఇచ్చారు. దీంతో జనసేన కార్యకర్తలు రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ను గుర్తించే పనిలో పడింది జనసేన.
ప్రజాసమస్యలపై.....
కార్యకర్తల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా జనంలోకి వెళ్లాలని పవన్ నిర్ణయించుకున్నారు. శ్రీకాకుళం ఉద్దానం సమస్య పై పవన్ పర్యటన హిట్ కావడంతో మరిన్ని హిట్ లు కొట్టేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్యపై అక్కడి జనసేన కార్యకర్తలు ఇప్పటికే నివేదిక అందించారట. అలాగే శ్రీకాకుళం జిల్లాలో వంశధార నిర్వాసితుల సమస్యలపై కూడా పవన్ ఫీడ్ బ్యాక్ అడిగారని చెబుతున్నారు. వ్యూహాత్మకంగా ప్రజాసమస్యలపై స్పందిస్తూ పోతే ఎన్నికల సమయానికి క్షేత్రస్థాయిలో బలపడతామని పవన్ భావిస్తున్నట్లుంది. ఉద్దాన సమస్యపై పవన్ కల్యాణ్ కు రాష్ట్ర వ్యాప్తంగా అందరి నుంచి ప్రశంసలందడంతో అదే పంధాను అనుసరించాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు ఈ నెల 20 వ తేదీన మంగళగిరిలో జరిగే చేనేత కార్మికుల సభకు పవన్ హాజరై వారి సమస్యలను కూడా ప్రస్తావించనున్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ తన పార్టీ కార్యకర్తలతో క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించి వాటిపైనే పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లుంది. కేవలం ప్రత్యేక హోదానే పట్టుకుని పాకులాడుకుండా....ప్రజాసమస్యలను హైలెట్ చేయాలని ఈ పవర్ స్టార్ భావిస్తున్నారు