నంద్యాల ఉప ఎన్నికపై ఎగ్జిట్ పోల్ సర్వేలు రెండు పార్టీల్లోనూ గందరగోళానికి దారితీస్తున్నాయి. కొన్ని సర్వే సంస్థలు టీడీపీకి మెజారిటీ వస్తుందని చెబుతుంటే మరికొన్ని వైసీపీదే విజయమని చెబుతున్నాయి. నామినేషన్ రోజు, ప్రచారం సమయంలో, పోలింగ్ సమయంలో కొన్ని సర్వే సంస్థలు నంద్యాలలో సర్వే నిర్వహించినట్లు ప్రకటించుకున్నాయి. అయితే ఎక్కువ సంస్థలు టీడీపీదే విజయమని ఫలితాలు వెల్లడించాయి. కాని కొన్ని సంస్థలు మాత్రం వైసీీపీకే ఎడ్జ్ ఉన్నట్లు చెప్పాయి. దీంతో రెండు పార్టీల్లో గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తమవుతోంది. ఎక్కువ శాతం పోలింగ్ జరిగితే అధికార పార్టీ వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుందని కొందరు విశ్లేషిస్తుండగా, అధికార పార్టీకి మద్దతు తెలిపేందుకే పెద్దయెత్తున ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారని టీడీపీ చెబుతోంది.
ఏజెంట్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా......
కులాల వారీగా, సామాజిక వర్గాల వారీగా, గ్రామాల వారీగా పార్టీ నేతలు లెక్కలు వేసుకుని మరీ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఘట్టం ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రాల ఏజెంట్లతో నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి నుంచి ఏ పోలింగ్ కేంద్రంలో ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయని ఆరా తీశారు. ఏజెంట్లు ఇచ్చిన సమాచారం మేరకు గెలుపు తమదేనన్న ధీమా రెండు పార్టీల్లోనూ వ్యక్తమవుతుండటం విశేషం. 255 పోలింగ్ కేంద్రాల ఏజెంట్లతో సమావేశమైన వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి వారితో చర్చించిన తర్వాత గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అఖిలప్రియ కూడా విజయం తమదేనంటున్నారు. మొత్తం మీద సర్వేలు, ఏజెంట్లు ఇచ్చిన సమాచారంతో రెండు పార్టీల్లో గెలుపుపై ధీమా వ్యక్తమవుతోంది.