ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన కాల్ సెంటర్ 1100 అద్భుత ఫలితాలు సాధిస్తోందని ముఖ్యమంత్రి గొప్పగా చెబుతుంటే మరోవైపు కాల్ కనెక్టివిటీనే ఉండటం లేదని జనం పెదవి విరుస్తున్నారు. ప్రజా పరిష్కార వేదికను ప్రారంభించి 4నెలలు అవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 21న సేవలు ప్రారంభిస్తే మే 2వ వారం నుంచి పూర్తిస్థాయిలో పని చేస్తోందని సిఎం చెప్పారు. ఎప్పటికప్పుడు వివిధ అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరపడం, ఆ సమాచారం సంబంధిత శాఖలకు పంపడం, ప్రజల ఫిర్యాదులు పరిష్కారం అయ్యేలా చూడటం, ఆ సమాచారం ఫిర్యాదుదారులకు ఇవ్వడం ఒక పద్దతి ప్రకారం జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా కాల్ సెంటర్ 1100 పరిష్కార వేదిక పనిచేస్తోందని కితాబిచ్చారు.
అంతా ఉత్తుత్తిదేనా?
ఉచిత ఇసుక విధానంపై కాల్ సెంటర్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరించి, కేబినెట్లో సమీక్షించి కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. సమర్ధవంతంగా, పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు పరుచుటకు మైనింగ్ డిపార్ట్ మెంట్ మరియు రియల్ టైం గవర్నెన్స్ డిపార్ట్ మెంట్ లను అనుసంధానం చేయడం జరిగిందని ., ఏ ఫిర్యాదు ఉన్నా వినియోగదారులు కాల్ సెంటర్ 1100 నెంబర్ కు ఫోన్ ద్వారా తెలియజేయవచ్చని ప్రభుత్వం చెబుతుంటే వాస్తవ పరిస్థితి మాత్రం అంతకు భిన్నంగా ఉంది. ప్రభుత్వ లెక్కల్లో సంతృప్త స్థాయి భేషుగ్గా ఉంటే విజయవాడ వంటి నగరంలో ఇసుక పుష్కలంగా లభిస్తున్నా ధరలు మాత్రం ఏ మాత్రం దిగి రావడం లేదు. ఉచిత ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేయడానికి ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు చేపడుతోందని, సిసి టివి సర్వైలెన్స్, మొబైల్ చెక్ పోస్ట్ ల ఏర్పాటు చేశామని ఇసుక రీచ్ల వద్ద రవాణా కట్టుదిట్టం చేయడం, అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద పటిష్టమైన నిఘా...తదితర చర్యలను తీసుకుంటున్నామన్నారు. అక్రమంగా ఇసుకను సరిహద్దులు దాటిస్తే వారిపై పీడీయాక్ట్ పెట్టడానికి కూడా వెనుకాడబోమని చెబుతున్నారు. ముఖ్యమంత్రి అంత గొప్పగా చెబుతోన్న కాల్ సెంటర్ కనెక్టివిటీ కష్టాలపై మాత్రం శ్రద్ధ పెట్టకపోవడం గమనార్హం. ఏ మొబైల్ నెట్‌వర్క్ నుంచి కాల్ సెంటర్‌కు ఫోన్ చేసే అవకాశం లేదు. కార్వీ నిర్వహణలో ఉన్న ఈ కాల్ సెంటర్ కనెక్టివిటీ కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని జనం ఎదురు చూస్తున్నారు.