బీహార్ ను చూసి చలించిన మోడీ

Update: 2017-08-26 18:29 GMT

వరదలతో అల్లాడిపోతున్న బీహార్ ను ప్రధాని నరేంద్రమోడీ ఆదుకున్నారు. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదలతో బీహార్ తీవ్రంగా నష్టపోయింది. ప్రాణ, ఆస్తినష్టం తీవ్రంగానే జరిగింది. బీహార్ ను ఆదుకునేందుకు తక్షణం 500 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. బీహార్ వరద పరిస్థితిని సమీక్షించేందుకు ఈరోజు ప్రధాని నరేంద్రమోడీ ఏరియల్ సర్వేను నిర్వహించారు. పూర్ణియాలో మోడీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీలతో ఆయన మాట్లాడారు. బీహార్ ప్రభుత్వం ప్రధానికి వరద నష్టంపై సమగ్ర నివేదికను అందించింది.

రూ.500 కోట్ల ఆర్థిక సాయం......

బీహార్ లో వరదల కారణంగా 415 మంది వరకూ చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. బీహార్ లోని 21 జిల్లాలు వరద ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ముజఫర్ నగర్, సమస్టిపూర్, దర్బంగా జిల్లాల్లో ఇంకా పరిస్థితి మెరుగుపడలేదు. బాగ్ మతి, తిర్హుట్ కెనాల్ పొంగి పొరలి ప్రవహిస్తుండటంతో ఇంకా లక్షలాది మంది ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకున్నారు. బీహార్ కు గతంలో ప్రకటించిన ప్యాకేజీ విషయాన్ని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నితీష్ ప్రధానికి గుర్తు చేశారు. బీహార్ ను అన్నిరకాలుగా ఆదుకుంటామని అధైర్యపడవద్దని ప్రధాని ధైర్యం చెప్పారు.

Similar News